
కృష్ణా నదిలో వరద ఉద్ధృతి
క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం పొంగి ప్రవహిస్తున్న పెదమద్దూరు వాగు
అమరావతి: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి బుధవారం రాత్రి సుమారు 3 లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేయటంతో కృష్ణా నదిలో వరద పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి అమరావతిలో నది నీటిమట్టం గంటగంటకూ పెరగడంతో లోతట్టు పొలాలలో వరద చేరుతోంది. మండల పరిధిలోని పెదమద్దూరు, మునగోడు, అమరావతి,ఽ ధరణికోట, మల్లాది, దిడుగు గ్రామాలలో పంటలు నీట మునిగేలా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు నది పరివాహక ప్రాంత గ్రామాలలో పంట పొలాలు నీట మనిగాయి. మళ్లీ అదే పరిస్థితి వస్తుండటంతో రైతులకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. పెద మద్దూరు వాగుపై లోలెవల్ చప్టా పూర్తిగా నీట మునిగింది. చప్టాపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. విజయవాడ – అమరావతిలకు రాకపోకల నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని మళ్లీ అప్రమత్తం చేస్తున్నారు.