
డిమాండ్ల సాధనకు విశ్వబ్రాహ్మణుల ప్రదర్శన
నరసరావుపేట: పట్టణంలో అన్యక్రాంతమైన బ్రహ్మంగారి దేవాలయం ఆస్తులను కాపాడాలని, విశ్వకర్మలకు చట్టసభల్లో స్థానం కల్పించాలని, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ఆదివారం నరసరావుపేట నుంచి విజయవాడ వరకు చేపట్టిన విశ్వకర్మ బైక్ యాత్రలో జిల్లా నలుమూలల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుతారం వాసు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు జెండా ఊపి ప్రారంభించారు. తొలుత పల్నాడు రోడ్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ భగవాన్ విశ్వకర్మ విగ్రహాలకు బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ నాయకులు మేడికొండ సత్యానందబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు అన్ని విషయాలలో అండగా ఉంటానని వారి ఆర్థికాభివృద్దికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు కల్పించే విధంగా కృషిచేస్తానని అన్నారు. పట్టణంలో సత్తెనపల్లి రోడ్డులోగల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఆస్తులను అక్రమంగా అమ్మడంపై విచారణ జరిపించి సంఘానికి చెందిన దేవాలయ భూములను కాపాడాలని ఎమ్మెల్యేను కోరారు. విజయవాడ అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా సారె బహుకరించి అమ్మవారు ఆశీస్సులను అందుకున్నారు. పట్టణ కార్యదర్శి బొప్పూడి సాయిప్రసాద్, కోశాధికారి వేములూరి రాంబాబు, దాచేపల్లి టౌన్ ప్రెసిడెంట్ త్రయంబకచారి, మండల ప్రెసిడెంట్ నాగబ్రహ్మచారి, గురజాల మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, టౌన్ ప్రెసిడెంట్ కుందుర్తి కోటేశ్వరరావు, మాచర్ల గురజాల అప్పారావు, పిడుగురాళ్ల ప్రెసిడెంట్ దికొండ లక్ష్మణాచారి, కారంపూడి మండల ప్రెసిడెంట్ లింగాచారి, విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ