
19 మంది బాలలను రక్షించిన ఆర్పీఎఫ్
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్) : దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలో ఆర్పీఎఫ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 19 మంది మైనర్ బాలురులను రక్షించి 11 మంది ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివర వరకు రైలు భధ్రత వివరాలను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు తెలిపారు. ప్రత్యేక నిఘా బృందంతో 19 మంది పలు ప్రాంతాలకు చెందిన మైనర్ బాలురులను రక్షించి 11 మంది ఏజెంట్లపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మిషన్ రైల్ సురక్షలో డివిజన్ పరిధిలో 17 కేసులు నమోదు చేసి 33 మంది నేరస్తులను అరెస్ట్ చేసి చోరికి గురైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రయాణికుల వస్తువులకు సంబంధించి 15 దొంగతనాల కేసులలో 14 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17.16 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి చేసిన ఇద్దరి పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే రైళ్ళలో ధూమపానం చేస్తున్న 484 మంది పై కేసులు బనాయించడం జరిగిందన్నారు. ఆపరేషన్ నార్కోస్‌లో 21.123 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. ఆపరేషన్ నన్నే ఫరిస్టే కార్యక్రమంలో భాగంగా పారిపోయిన 83 మంది పిల్లలను రక్షించడం వారి వివరాలను సేకరించి ఛైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్‌లకు అప్పగించామన్నారు. ప్రయాణికులు వదిలి పెట్టిన రూ.23.11 లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందన్నారు. బచ్‌పన్ బచావ్ ఆందోళన రాష్ట్ర కో ఆర్డినేటర్, ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మైనర్‌లను అక్రమ రవాణా చేస్తున్న
11 మంది ఏజెంట్లపై కేసు నమోదు