
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి
కొరిటెపాడు(గుంటూరు): సమాచార హక్కు చట్టం–2005పై ప్రకృతి వ్యవసాయ రైతులు, సిబ్బందికి స్థానిక కృషీ భవన్‌లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి మాట్లా డుతూ ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలు, సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులకు ఏవిధంగా సహాయ పడగలమో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు ఏవిధంగా సమాచారం ఇవ్వాలి ? దరఖాస్తుదారుని పట్ల ఉద్యోగి వ్యవహారశైలి ఎలా ఉండాలి ? ఎంత గడువు లోపు సమాచారం ఇవ్వాలి? సర్టిఫైడ్ కాపీలకు రుసుం ఎంత తీసుకోవచ్చు? ఆలస్యానికి చెల్లించాల్సిన జరిమానా, అదనపు సమాచారం ఎప్పుడు అందించాలి? నిర్దేశించిన గడువులో సమాచారం ఇవ్వకపోతే దాని పరిణామాల గురించి విపులంగా సిబ్బందికి వివరించారు. సిబ్బంది సందేహాలకు సమాధానం ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ సత్యతనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించే పౌరుల పట్ల ఉద్యోగి సహృదయంతో, గౌరవంతో వ్యవహరించాలని కోరారు. అవగాహన సదస్సులో ప్రకృతి వ్యవసాయ సబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణ దానంతో సమానం
రక్తదానం చేసిన డీఆర్‌ఎం సుధేష్ట సేన్
లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ట సేన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్‌లో గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్‌ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డివిజనల్ పర్సన్ ఆఫీసర్ షహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యా బి. రాజ్, సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కార్తికేయ గాడఖ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్‌బాబు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయ కార్తి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శైలేష్‌కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్ పాల్గొన్నారు.
ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు
తాడేపల్లి రూరల్ : జిల్లాస్థాయి రోడ్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. పోటీలను తాడేపల్లి రూరల్ పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూలులో నిర్వహించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి, ప్రిన్సిపాల్ దీనకుమారి, వైస్ ప్రిన్సిపాల్ మౌనిక, గుంటూరు జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నిర్వహణ కార్యదర్శి ఇమ్మానియేలు రాజు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం

సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం