
ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 3.2 మి.మీ., తాడికొండ 3.2, దుగ్గిరాల 2.8, గుంటూరు తూర్పు 2.4, తుళ్లూరు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది.
పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,522 క్యూసెక్కులు గురువారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 276 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,748, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 681, పశ్చివ కాలువకు 270, నిజాపట్నం కాలువకు 506, కొమ్మూరు కాలువకు 2,680 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,72,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సుమారు 32 నుంచి 35 ఏళ్ల వ్యక్తి స్టేషన్ ఉత్తర కేబిన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.