
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
నరసరావుపేట: విద్యుత్ చార్జీలు పెంచినా, స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజా ఉద్యమం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో రైతు సంఘ జిల్లా ప్రధాన ఏపూరి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్మార్ట్ మీటర్లు అంగీకరించిన వారికి బిగించమని చెప్పారని, అంగీకారాలతో సంబంధం లేకుండా ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతో సామాన్య ప్రజలపై పెనుభారాలు మోపుతూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెకీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలతో ఈనెల 5న విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద, సచివాలయాల వద్ద జరిగే నిరసన ధర్నాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకున్న నేపథ్యంలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.