
పంటల బీమాపై అవగాహన కల్పించండి
గుంటూరు వెస్ట్: జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై అవగహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరికీ బీమా అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో మిర్చి, వరి తదితర పంటలు సాగు చేస్తున్న 3,48,933 రైతులకు బ్యాంకర్లు ఇప్పటివరకు రుణాలు మంజూరు చేశారన్నారు. వీరిలో మిర్చి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఈ నెలాఖరులోపు, వరి సాగు చేసే రైతుల వివరాలు వచ్చే నెల 15వ నాటికి బ్యాంకర్లు ఇన్స్యూరెన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పంటల బీమాపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు రైతు సేవా కేంద్రాల ద్వారా బ్యాంకర్లు, అధికారులు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. పంటల బీమా పథకాన్ని పొడిగించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డుల జారీతోపాటు వ్యవసాయ రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యయసాయాధికారి నాగేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహీపాల్ రెడ్డి, ఉద్యాన శాఖాధికారి రవీందర్, బ్యాంకర్లు, ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి