
మెదడుకు పదును
హైస్కూల్/ కళాశాల విద్యార్థుల
● శాసీ్త్రయ పరిశోధనల దిశగా కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ● విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష ద్వారా ఎంపిక ● పరిశోధనలు, ప్రయోగాలపై ఆసక్తి కనబర్చే విద్యార్థులకు పుష్కల అవకాశాలు ● పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ● హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్/సత్తెనపల్లి: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్‌లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
వీవీఎం 2025–26 ముఖ్యాంశాలు
జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఆర్టీ) జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వీవీఎం సైన్స్ ప్రతిభా పరీక్షకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులను పరిశోధన, ప్రయోగాల వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది.
శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సాహం
విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, సంప్రదాయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సహకారాల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడం వీవీఎం ముఖ్య ఉద్దేశం. వర్క్‌షాప్‌లు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందించి, శాసీ్త్రయ దృక్పథం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. శాసీ్త్రయ రంగంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధనల దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు మార్గదర్శకులను అందించడం లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవంతమైన విద్యార్థులను గుర్తించి, వారిని సత్కరించడం, దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థలకు విజేతల కోసం ఎక్స్‌పోజర్ సందర్శనలను నిర్వహించడం ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.
పరీక్షకు రిజిస్ట్రేషన్
అక్టోబర్‌లో జరగనున్న ఆన్‌లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల తాము చదువుతున్న పాఠశాల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివిధ దశల్లో జరగనున్న వీవీఎం ప్రతిభా పరీక్ష సిలబస్, సబ్జెక్టు పరమైన సందేహాలు నివృత్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలకు vvm. org. in సైట్‌లో బ్రోచర్, నోటిఫికేషన్ పరిశీలించాలి.

మెదడుకు పదును

మెదడుకు పదును