
మహనీయుడు అబ్దుల్ కలాం
పట్నంబజారు: భారతదేశం యావత్తూ గర్వించదగ్గ మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కొనియాడారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కలాం వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి సైంటిస్ట్‌గా ఎదిగిన గొప్ప మహనీయుడు అబ్దుల్ కలామ్ అని కీర్తించారు. అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని తెలిపారు. అద్భుతమైన కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే వరకు శ్రమించాలని యువతకు గొప్ప సందేశమిచ్చారని గుర్తు చేశారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఏజీజే అబ్దుల్ కలాం భౌతికంగా లేకున్నా, 140 కోట్ల మంది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని తెలిపారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. రక్షణ రంగంలో భారతదేశం రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలకు దీటుగా నిలబడేందుకు అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారని వివరించారు. రాష్ట్రపతి పదవి అనంతరం గజం భూమి, బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా కట్టు బట్టలు మాత్రమే ఉన్న మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కలాం మాత్రమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ యుద్ధాల్లో భారత్ విజయం సాధిస్తుందంటే అబ్దుల్‌కలాం కృషి ఎంతగానో ఉందని చెప్పారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆరాధించే గొప్ప మేధావి అబ్దుల్ కలాం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ హార్డ్ వర్క్, ఎడ్యుకేషన్, డ్రీమ్ అంశాల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని చాటి చెప్పిన మహనీయుడు అబ్దుల్‌కలామ్ అని వివరించారు. ఆయన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించారని, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారంటే, దాని వెనుక ఆయన కృషి స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ మస్తాన్‌వలి, షేక్ గులాం రసూల్, మెట్టు వెంకటప్పారెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా, నగర కమిటీ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.