
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోంలో చైర్‌పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు భారంగా మారిన అనవసరమైన యాప్స్ తొలగింపు అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులిసీరత్నం, వివిధ జిల్లాల మహిళా నాయకులు పాల్గొన్నారు.
582 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమా నం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 511, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.