
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆగస్టు 5న ధర్నా
బాపట్ల: ప్రభుత్వ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. ఆదివారం బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్‌మీటర్లు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వచ్చే నెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు కొనుగోలులో పేద రైతు కౌలు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తే మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలో అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక చర్యలు, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీల మోత, స్మార్ట్‌మీటర్ల ప్రమాదం వంటి సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి, పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, టి కృష్ణమోహన్, సీహెచ్ మజుందర్, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్, కొండయ్య పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి