
ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్‌లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. టీచర్లకు రకరకాల శిక్షణ ఇచ్చి బోధనను ఆటంకపరుస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇక నుంచైనా ఆన్‌లైన్ పనులు ఆపి అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
కొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత పది రోజులుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 63.8 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 0.4 మి.మీ. వర్షపాతం కురిసింది. సగటున 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొల్లిపర మండలంలో 45.4 మి.మీ., తుళ్ళూరు 28.2, తాడికొండ 25.6, మంగళగిరి 25, పెదకాకాని 20, తాడేపల్లి 19.6, గుంటూరు తూర్పు 17.6, గుంటూరు పశ్చిమ 16.2, ఫిరంగిపురం 8.2, తెనాలి 6.4, చేబ్రోలు 4, పెదనందిపాడు 3.6, కాకుమాను 3.4, మేడికొండూరు 3.4, ప్రత్తిపాడు 2.6, వట్టిచెరుకూరు మండలంలో 2.4 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది. జూలై 26వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 138.3 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 228.2 మి.మీ. నమోదైంది.
కారు కాలువలో పడి విద్యార్థి మృతి
అమర్తలూరు (వేమూరు) : కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో జూపూడి పవన్ (18) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ రవితేజ కథనం మేరకు.. విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం అద్దెకు తీసుకున్న కారులో ఒంగోలులోని జూపూడి పవన్ ఇంటికి వెళ్లారు. తిరిగి బాపట్ల బీచ్‌కు వెళ్లి, విజయవాడ బయలు దేరారు. ఈ క్రమంలో అమర్తలూరు మండలం ప్యాపర్రు, యలవర్రు రోడ్డు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడి పోయింది. కారులో ఉన్న విద్యార్థులు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారు. అప్పటికి పవన్ మృతి చెందాడు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా విజయవాడ నగరానికి చెందిన విద్యార్థులని ఎస్‌ఐ తెలిపారు. పవన్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.