
రాజ్యాంగంపై దాడి చేస్తారా?
చీరాల రూరల్: దేశంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలు పొందుపరచారని వాటిని తొలగిస్తే రాజ్యాంగంపై దాడిచేసినట్టేనని విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్‌కుమార్ అన్నారు. ఏపీ ఊరూరా జనవిజ్ఞానం, వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్‌కుమార్, ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన దేశభక్తి, ప్రజాస్వామ్యం, సామాజిక స్పృహ, లౌకిక భావాలు, సమసమాజ నిర్మాణం, శాసీ్త్రయ ఆలోచన, గణతంత్ర రాజ్యం, సామాజానికి న్యాయం, సామాజిక సంస్కరణ అనే ఈ పది అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో కూడా ఆటోచనా ధోరణి పెంపొందించుటకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అనంతరం వినయ్ రాజ్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాదె హరిహరరావు, వై.రవికుమార్, టి.అంకయ్య, నాగమనోహర్ లోహియ, ఎం.మణిబాబు, ఎస్‌కే సుభాని, జి.జోజిబాబు, జిలాని పాల్గొన్నారు.