బదిలీల్లో బేరసారాలు | - | Sakshi
Sakshi News home page

బదిలీల్లో బేరసారాలు

Jul 15 2025 6:59 AM | Updated on Jul 15 2025 6:59 AM

బదిలీ

బదిలీల్లో బేరసారాలు

● గాలిలో సచివాలయ మహిళా పోలీసుల బదిలీలు ● 107 మందికి ఇంకా దక్కని పోస్టింగ్‌లు ● ముడుపులు, పలుకుబడి ఉన్న వారికే అర్బన్‌ పోస్టింగ్‌లు ● సిఫార్సు లేఖలు తెచ్చుకోవాలంటూ అధికారుల ఉచిత సలహాలు ● ఆగమ్యగోచరంగా మహిళా పోలీసుల భవితవ్యం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మహిళలకు ఏదైనా సమస్య వస్తే ముందు పోలీస్‌ శాఖ రక్షణగా ఉంటుంది. అటువంటిది తన శాఖలోనే పని చేస్తున్న సచివాలయ మహిళా పోలీసులకే అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ నిలుస్తుంది. అయిదేళ్లు పూర్తయిన వారికి సాధారణ బదిలీల్లో భాగంగా సచివాలయ ఉద్యోగులకు కూడా గత నెలలో నిర్వహించారు. అయితే, మహిళా పోలీసులకు మాత్రం గత నెల 27, 29వ తేదీల్లో దరఖాస్తు మీద ఐదు ఆప్షన్లు తీసుకుని పంపించేశారు. దీనికి సంబంధించి ఈ నెల 7వ తేదీ రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 107 మందికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఉత్తర్వులు చూసి కంగుతిన్న మహిళా పోలీసులు గుంటూరు ఎస్పీ, పల్నాడు ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి సమస్యను విన్నవించినప్పటికి ఫలితం శూన్యం.

జాబితాలో 107 మంది పేర్లు గల్లంతు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,100 మంది మహిళా పోలీసులు పని చేస్తున్నారు. 2019లో వచ్చిన మార్కులు, ర్యాంక్‌, టెక్నికల్‌ విద్యార్హతలను బట్టి అందరికీ ఆమోదయోగ్యంగా సచివాలయంలో పోస్టింగ్‌ కల్పించారు. ప్రస్తుతం ఐదేళ్లు పూర్తి కావడంతో సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎక్కడికై నా బదిలీలు చేపట్టారు పోలీస్‌ అధికారులు. అయితే, ఇందులో రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలకు, ముడుపులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సచివాలయం కేటాయింపు జరిగిందని పలువురు మహిళా పోలీసులు ఆరోపిస్తున్నారు. 1100 మంది ఆప్షన్స్‌ ఇచ్చారని..ఇందులో 120 మంది మహిళా పోలీసులు రిక్వస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌(స్పౌజ్‌, మెడికల్‌) కింద దరఖాస్తు చేసుకున్నారని, నోటిఫికేషన్‌ ఇచ్చిన అధికారులు 107 మందికి పోస్టింగ్‌ ఎందుకు కల్పించలేదని నిలదీస్తున్నారు. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయ సిబ్బందిని కలిస్తే బదిలీల లిస్ట్‌లో పేర్లు కనిపించడం లేదని తీరికగా సమాధానం చెప్పడంతో మౌనంగా వెనుతిరిగారు.

పల్నాడు ఎస్పీ సీసీ, కంప్యూటర్‌ ఆపరేటర్‌దే హవా?

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి బదిలీల ప్రక్రియ అంతా కూడా గుంటూరు జిల్లా నుంచే జరుగుతుంది. కానీ మహిళా పోలీసు బదిలీ ప్రక్రియ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పల్నాడు ఎస్పీ కార్యాలయానికి అప్పగించారు. ఇందులో కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయ సీసీ, కంప్యూటర్‌ ఆపరేటర్లు హవా కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకులు సిఫార్సు లేఖలు తెచ్చిన వారికి, ముడుపులు సమర్పించుకున్న వారికి ఎక్సెల్‌ షీట్‌లో సచివాలయాలను బ్లాక్‌ చేసుకుని పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముడుపులు, రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలు ఇవ్వని వారిని దూరంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయాలకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోస్టింగ్‌ కావాలంటే లక్ష సమర్పించుకోవాల్సిందే?

107 మందికి పోస్టింగ్‌ రాకపోవడంతో గత నాలుగు రోజులుగా పల్నాడు ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘‘మీకు పోస్ట్‌ రాకపోతే మాకు సంబంధం లేదు..రెండు నెలలైనా జీతాలు రాకపోవచ్చు..మీ పోస్ట్‌ హోల్డ్‌లో పడింద’’ని చెప్పడంతో కంగుతిన్నారు. ఒక్కొక్కరిని కార్యాలయం లోపలికి పిలిచి, ఫోన్లు తీసుకుని మరీ మహిళా పోలీసులతో పోస్టింగ్‌లపై పల్నాడు ఎస్పీ కార్యాలయ సిబ్బంది బేరసారాలు నడిపారని వారు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పోస్టింగ్‌ ఇవ్వాలంటే రూ.60వేలు సమర్పించుకోవాలని..అదే అర్బన్‌ లిమిట్స్‌లో అయితే రూ.లక్ష వరకు సమర్పించుకోవాలని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అంత డబ్బులు ఉంటే మొదటి లిస్ట్‌లో పోస్టింగ్‌ తెప్పించుకునే వారమని వారు వాపోయారు. తమకు అన్యాయం చేస్తే కోర్టును ఆశ్రయించేందుకు మహిళా పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

బదిలీల్లో బేరసారాలు 1
1/1

బదిలీల్లో బేరసారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement