
పోలీసుల ‘పచ్చ’పాతంపై నిరసన
నగరంపాలెం: వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు ఏ చిన్న ఫిర్యాదు చేసినా కేసులు నమోదు, అరెస్ట్‌లు చేయడం, జైళ్లకు పంపించడం వెంటనే జరుగుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. టీడీపీ మూకలపై వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తే కూటమి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గాంధీ మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్లకార్డులతో నిరసనకు దిగారు. నల్ల దుస్తులు ధరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన’ అనే ప్లకార్డు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ‘సత్యమేవ జయతే’ అనే ప్లకార్డుతో గంటసేపు నిలువు కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నేతలు సైతం అదే బాట పట్టారు.
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ పట్టాభిపురం పీఎస్‌లో గతేడాది డిసెంబర్ 12న సీమరాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్, తనపై, పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అనరాని మాటలు అన్నాడని, పచ్చి బూతులు తిడుతున్నాడని ఆధారాల సహా ఫిర్యాదు చేశానని తెలిపారు. కేసులు నమోదులో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మే ఐదో తేదీన అదే పట్టాభిపురం పీఎస్‌లో మరోసారి ఫిర్యాదు చేశానని తెలిపారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మళ్లీ కిరాక్ ఆర్పీ అనే పెద్ద మనిషి పచ్చి బూతులతో సోషల్ మీడియాలో మాజీ సీఎం వైఎస్ జగన్, తనపై, మాజీ మంత్రి ఆర్కే రోజాపై, నాయకులు, కార్యకర్తలను ఇష్టానుసారంగా తిడుతున్నాడని లింక్‌ల సహా పెన్‌డ్రైవ్‌లో ఎక్కించి పోలీసులకు అందజేశానని తెలిపారు. పట్టాభిపురం పీఎస్‌లో ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదని, ఈ ఏడాది మే పదిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు మరో ఫిర్యాదు అందించినట్లు చెప్పారు.
పోలీసులు మేలుకోవాలి
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి, వైఎస్సార్ సీపీ నేతలపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో, వారికి ఇష్టమైన చానెళ్లల్లో సీమరాజు అలియాస్ చంద్రకాంత్‌చౌదరి, కిరాక్ ఆర్పీలు తమ వ్యక్తిగత జీవితాల జోలికి వస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం, పోలీసులు మేలుకోవాలని ఆయన సూచించారు.
ఇప్పటి వరకు సీమరాజు, కిరాక్ ఆర్పీలపై కేసులు నమోదు కాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్, భారతి, వైఎస్సార్ సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే వెంటనే కేసులు నమోదు గాంధేయ మార్గంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన గంట సేపు నిలబడి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి, మాజీ ఎంపీ మోదుగుల, నేతలు