
ఆధునిక సెన్సార్లతో విద్యుత్తు హెచ్చుతగ్గుల నియంత్రణ
పెదకాకాని: ఎలక్ట్రికల్ స్మార్ట్ గ్రిడ్లలో అధునాతన సెన్సార్‌లను వినియోగించడం ద్వారా విద్యుత్ హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చని ఏపీ ట్రాన్స్‌కో అండ్ ఏపీఎస్‌ఎల్‌డీసీ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ శ్రీనివాస్ కవటూరి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా’ ఆధ్వర్యంలో అధునాతన సెన్సార్లను వినియోగించి స్మార్ట్ గ్రిడ్ శక్తి, ఉత్పత్తి, పంపిణీ, వినియోగాన్ని విశ్లేషించడంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీనివాస్ కవటూరి, డెప్యూటీ ఈఈ ఆర్‌వీఆర్ సంతోష్, ఐఈఐ ఏసీ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎస్ దేవకుమార్ హాజరయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ పరికరాలు కాలపరిమితిని కూడా పెంచవచ్చని తెలిపారు. ఏఐ ఆధారిత బిగ్ డేటా ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించి భవిష్యత్ అవసరాలు గుర్తించేదుకు వీలవుతుందని వివరించారు. డాక్టర్ శ్రీనివాస్ కవటూరి, ఆర్‌వీఆర్ సంతోష్‌లను వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబులు సత్కరించారు. కార్యక్రమంలో వీవీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్‌బాబు, ఐఈఐ విద్యార్థి విభాగం సంధానకర్త డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.