కసిదీరా హతమార్చి.. | - | Sakshi
Sakshi News home page

కసిదీరా హతమార్చి..

Jul 19 2025 4:10 AM | Updated on Jul 19 2025 4:12 AM

నగరంపాలెం: జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై మంది దారుణ హత్యకు గురయ్యారు. వివాదాలు, పాతకక్షలు, నగలు, నగదు దోపిడీ కోసం దుండగులు ఇలా తెగబడుతున్నారు. దీంతో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. మద్యం మత్తు కూడా ఈ హత్యలకు కారణంగా నిలుస్తోంది.

ఎందుకీ క్రూరత్వం?

నిందితుల్లో ఎక్కువగా సుమారు 30– 40 ఏళ్లలోపు వారే. ప్రత్యర్థులను కిరాతకంగా హతమార్చారు. తాడేపల్లి సీతానగరం పట్టాభిరామయ్యకాలనీలో ఓ వ్యక్తిని క్రూరంగా చంపేశారు. క్రైం సినిమాల్లో మాదిరి అతని మెడలో కత్తి దించి అలజడి స్పష్టించారు. ఇక మంగళగిరి ఎంఎస్‌నగర్‌ వాసి కోటేశ్వరరావు చేతి మణికట్టులను కత్తులతో నరికారు. ఆనందపేటలో జరిగిన పఠాన్‌ ఖాజాబి హత్యతో కొద్ది రోజులు స్థానికులు రాకపోకలకు హడలిపోయారు. పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామ వాసి శ్రీనివాసరావును హత్య చేసి పంట కాల్వల్లో పడేశారు. వంద గొర్రెలను ఎత్తుకెళ్లారు. తెనాలిలో వియ్యపురాళ్లు ప్రాణాలతో బయటపడేందుకు ప్రత్యర్థులతో పెద్ద పెనుగులాటే జరిగింది. చివరికి ప్రాణాలు వదిలారు. ఓ వృద్ధురాలిపై లైంగిక దాడి చేసి, హత్య చేశారు. మేడికొండూరు మండల పరిధిలో ముగ్గురు మందుబాబులు ఒకర్ని బీరు సీసాలతో అత్యంత పాశవికంగా హత్య చేశారు. హతమార్చే దృశ్యాలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు.

నియంత్రణకు చర్యలు అంతంతే

జిల్లాలో ఇలాంటి కేసుల నియంత్రణకు చేపడుతున్న చర్యలు అంతంత మాత్రమేనని చెప్పాలి. గుంటూరు సమాచార సేకరణలో స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ వెనుకంజలో ఉండటమే దీనికి కారణమనే అనుమానాలు లేకపోలేదు. మంగళగిరి, తెనాలి, దక్షిణ సబ్‌ డివిజన్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. సబ్‌ డివిజన్‌కు ఐదారుకుపైగా హత్యలు జరిగాయి. రాజధాని ప్రాంతమైన జిల్లా, గుంటూరు నగరంలో ప్రోటోకాల్‌, బందోబస్త్‌లతో పోలీసులకు ఊపిరాడటం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సిబ్బంది లేరు.

ప్రత్యర్థులను అతి క్రూరంగాచంపేస్తున్న దుండగులు నగలు, నగదు లక్ష్యంగా ప్రాణాలు బలి తీసుకుంటున్న చోరులు మంగళగిరి, తెనాలి, దక్షిణ సబ్‌ డివిజన్లలోనే ఎక్కువ దారుణాలు

ఇవిగో నిదర్శనాలు

ఏప్రిల్‌ 1న అరండల్‌పేటలో భిక్షాటన చేసుకునే కేవీపీ కాలనీ వాసి గణేష్‌ (35)ను ముగ్గురు స్నేహితులు హతమార్చారు. గణేష్‌పై నగరంపాలెం పీఎస్‌లో సస్పెక్ట్‌ రౌడీషీట్‌ ఉంది.

ప్లాస్టిక్‌ సీసాలు ఏరుకునే శారదాకాలనీ వాసి దారావతు రాము (60), రెడ్డిపాలెం వాసి బట్టు రాజులు కలిసి మద్యం తాగి గొడవ పడ్డారు. రాజు మద్యం సీసాతో రాముపై దాడి చేసి హతమార్చాడు.

ఆనందపేట రెండో వీధిలో ఉంటున్న వంట మాస్టర్‌ పఠాన్‌ హర్షద్‌ ఓ యువతి తనను ప్రేమిస్తున్నట్లు చెబుతుండగా ఏప్రిల్‌ 3న గొడవ జరిగింది. హర్షద్‌ను హతమార్చేందుకు యువతి తరఫు వారు మారణాయుధాలతో వెంటపడ్డారు. క్షతగాత్రులను చూసేందుకు వెళ్లిన పఠాన్‌ ఖాజాబి (70)ని ప్రాణాలు కోల్పోయింది.

ఏప్రిల్‌ 28న పేరేచర్ల నరసరావుపేట రోడ్డులోని రైల్వేట్రాక్‌ పక్కనున్న తోటలో మంగళగిరికి చెందిన బాలకృష్ణ (40)ను బీరు సీసాలతో తలపై మోది ముగ్గురు హత్య చేశారు. 2019లో జరిగిన ఓ హత్య కేసులో వీరు నిందితులు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

మే 2న దుగ్గిరాల మోరంపూడి గ్రామంలో రఘునాథరావు (35), గోపీలు మద్యం తాగి గొడవ పడ్డారు. రఘునాథరావు తలపై రోకలి బండతో గోపీ మోదడంతో మృతి చెందాడు.

మే 7న మంగళగిరి ఎంఎస్‌ఎస్‌గర్‌కు చెందిన కోటేశ్వరరావు (47)ను పెదవడ్లపూడి సమీపంలో దారుణంగా హత్యచేశారు. పీక కోయవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

జూన్‌ 3న తెనాలి అయ్యప్పస్వామి గుడి వద్ద ఒంటరిగా ఉంటున్న తాడిపత్రి మల్లీశ్వరి (60)పై హత్యాచారం జరిగింది. ఆమెకు చెందిన బంగారు నగలతో దుండగులు పారిపోయారు.

జూన్‌ 19న తెనాలిలో వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పి.అంజమ్మ (70)లను దారుణంగా హత్య చేసిన దుండగులు, బంగారు నగలు దోచుకెళ్లారు.

కసిదీరా హతమార్చి.. 1
1/2

కసిదీరా హతమార్చి..

కసిదీరా హతమార్చి.. 2
2/2

కసిదీరా హతమార్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement