
పాత పింఛను విధానం అమలుకు డిమాండ్
గుంటూరు వెస్ట్: పాత పెన్షన్ విధానాన్ని 2003 డీఎస్‌సీలో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని అమలు చేయాలని డీఎస్‌సీ–2003 ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మోపిదేవి శివశంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తమకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఓపీఎస్ విధానం అమలు కాలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన టెక్నికల్ తప్పుల వలన తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 57 ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సకాలంలో స్పందించకపోతే తమ న్యాయ పోరాటం ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సలగల ప్రసన్న కుమార్, ఘంటసాల శ్రీనివాసరావు, నరసింహారావు, శ్రీలం యలమంద, మారెళ్ళ శ్రీనివాసరావు పాల్గొన్నారు.