
ఏ‘మార్చి’ విధుల్లో వైద్యులు
పేద రోగులకు సేవలందించాల్సిన వైద్యులు వారు.. కానీ, సేవ మాట దేవుడెరుగు.. కనీసం అధికారికంగా విధులు నిర్వర్తించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సిన వారు.. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంబంధం లేని విధుల్లో ఉంటున్నారు. ఇక ఉన్న సిబ్బందిలో మరికొందరు ఎక్కడంటే అక్కడకు వెళ్లినా హాజరు సైతం నమోదు అయ్యేలా మేనేజ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
గుంటూరు మెడికల్: గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్‌లను నియమించింది. గతంలో ఒక్కొక్కరు ఆరోగ్య కేంద్రాల్లో ఉండేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇద్దరు చొప్పున నియమించింది. ఆరోగ్య కేంద్రాల పనివేళలు పెంచి స్టాఫ్ నర్సులను అదనంగా ఏర్పాటు చేసింది. పీహెచ్‌సీలో కీలకమైన పలువురు మెడికల్ ఆఫీసర్లపై ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం లేదని, రోగులకు సేవలు చేయడం లేదని డీఎంహెచ్‌ఓకు, జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయి. వారిపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు. పనితీరు పర్యవేక్షించి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు సేవలు అందించేలా చూడాల్సిన ప్రోగ్రాం ఆఫీసర్లు అసలు ఆ విషయమే మరిచిపోయారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోనే తిష్ట వేసిన ఆరోగ్య కేంద్రాల సిబ్బందిపై ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాజరు నమోదు చూస్తారట..
పీహెచ్‌సీల్లో రోగులకు సేవలందించాల్సిన ఓ డాక్టర్ ఇలా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తిష్ట వేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది హాజరును పర్యవేక్షించే పనులు నిర్వహిస్తున్నారు. పరిపాలనా అధికారులు, మినిస్టీరియల్ ఉద్యోగులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. దీంతో వీరు డమ్మీలుగా మారారు. వాస్తవానికి ఆరోగ్య కేంద్రాల్లో ఉండి వైద్యులు, వైద్య సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ మొబైల్ ద్వారా వేయాలి. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంతో గుంటూరులో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా హాజరు నమోదవుతోంది. ఈ మేరకు డేటా మార్చారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. అర్బన్ పీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో పనిచేయాల్సిన వైద్యులు కొంత మంది దొడ్డి దారిలో డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులను మంచి చేసుకుని, గుంటూరులోనే తిష్ట వేస్తున్నారు. కొందరికై తే ఏ పనీ ఉండటం లేదు. హాజరు వేసి ఇళ్లకు వెళ్లిపోయి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరికొందరు సంబంధం లేని పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు సదరు వైద్యుల నుంచి లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చర్యలకు వెనకడుగు
ఇటీవల జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి చికిత్స కోసం వచ్చిన సమయంలో ఓ మెడికల్ ఆఫీసర్ రెండు కాళ్లు లేబుల్ మీద పెట్టి సెల్‌ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ అతడిపై డీఎంహెచ్‌ఓ కార్యాలయం చర్యలు తీసుకోలేదు. మరో వైద్య అధికారి మద్యం తాగి విధులకు హాజరవుతూ దుర్భాషలాడుతున్నారని పలువురు వైద్య సిబ్బంది డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఆరోగ్య కేంద్రాలకు రాని కొందరు వైద్య అధికారులను మార్చాలని ప్రజలు, రోగులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తిష్ట
అసలు విధులు మర్చిపోయి
కార్యాలయ ఉద్యోగుల పనుల్లో
నిమగ్నం
వైద్య సేవలు అందక తీవ్ర
ఇబ్బందులు పడుతున్న రోగులు