
ఇంటిపై ‘షార్ట్’ పిడుగు
తెనాలి సీబీఎన్ కాలనీలో ఓ కుటుంబం 2020లో ఇంటి నిర్మాణానికి పూనుకుంది. ఇల్లాలి పేరిట మున్సిపాలిటీకి ప్లాను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేశారు. డీపీఎంఎస్ ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతిని మంజూరు చేశారు. ఆ కుటుంబం సంతోషంగా ఇల్లు నిర్మించుకుంది. ప్రస్తుతం ఆ ఇంటికి 14 శాతం ఖాళీ స్థలం చార్జీగా రూ.3.04 లక్షలు చెల్లించాలంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసు జారీ చేశారు.
తెనాలి: 2016–17 నుంచి నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు 2025లో మున్సిపాలిటీ ‘షార్ట్ ఫాల్స్’ నోటీసులనిస్తోంది. ఇప్పటికే తెనాలిలో 350కి పైగా ఇంటి యజమానులకు నోటీసులు అందాయి. భవన నిర్మాణ అనుమతికి సంబంధించి దరఖాస్తు చేసినపుడు తగిన పూర్తి సమాచారం సమర్పించక పోయినా, అవసరమైన అన్ని ఫీజులు చెల్లించకపోయినా ఆ దరఖాస్తు చెల్లుబాటు కాదనీ, పూర్తి అనుమతిని పొందకుండా ఎలాంటి నిర్మాణం చేసినా, అది అక్రమ నిర్మాణంగా పరిగణిస్తామని స్పష్టంగా జీఓలో ప్రభుత్వ పేర్కొంది. ఆన్‌లైన్‌లో జారీచేసిన భవన నిర్మాణ అనుమతిని రద్దుచేస్తామని, చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం అనధికార నిర్మాణాల తొలగింపునకు తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. ఇంటి యజమానికి నోటీసు ఇవ్వటంతోపాటు అప్పట్లో ఇంటి ప్లానును రూపొందించిన లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ)/ లైసెన్స్‌డ్ ఇంజినీరుకు కాపీని పెడుతున్నారు. నోటీసు అందిన తేదీనుంచి ఏడు రోజులలోపు షార్ట్ ఫాల్స్‌ను పూర్తిచేసి ఫైలును రీసబ్మిట్ చేయాలంటూ వచ్చిన మున్సిపాలిటీ నోటీసులు సదరు ఇంటి యజమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
దానపత్రాలనూ రిజిస్టర్ చేయాలట..!
ఇంటి నిర్మాణ సమయంలో భవిష్యత్‌లో అవసరమైతే రోడ్డు వెడల్పు కోసమని నిర్ణీత విస్తీర్ణంలోని స్థలాన్ని రూ.100 స్టాంపు పేపరుపై దానపత్రం రాసి, నోటరీ చేసిస్తే అప్రూవల్ ఇచ్చేవారు. ఇప్పుడా దానపత్రాలను బయటకు తీసి రిజిస్టరు చేసి ఇమ్మంటున్నారని ఒక గృహ యజమాని వాపోయారు. రైల్వేశాఖ స్థలానికి 100 మీటర్ల లోపు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే రైల్వేశాఖ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకునేవారు. కొత్త జీఓ ప్రకారం ఎన్‌ఓసీ రద్దుచేశారు. అప్పట్లో ఎన్‌ఓసీతో దరఖాస్తు చేసినవారిని, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయమంటున్నారని తెలిసింది. దరఖాస్తులో ఫోన్, ఆధార్ నంబర్లలో ఏదైనా అంకె తప్పు పడితే రద్దుచేసి, మళ్లీ రూ.3 వేల దరఖాస్తు ఫీజుతో రీసబ్మిట్ చేయాలంటున్నారని చెబుతున్నారు.
ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులు షార్ట్ ఫాల్స్‌కు డబ్బులు చెల్లించాలని డిమాండ్ లేకుంటే చట్టప్రకారం చర్యలంటూ హెచ్చరిక దిక్కుతోచని స్థితిలో ఇళ్ల యజమానులు, ఎల్‌టీపీలు
ఏడెనిమిదేళ్ల క్రితం వాటికి ఇప్పుడు నోటీసులా?
ఏడెనిమిదేళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు నోటీసులు ఏంటని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఏవైనా షార్ట్‌ఫాల్స్ ఉంటే, అప్పుడే సంబంధిత మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి, తగిన చర్యలు తీసుకోకుండా ఇన్నేళ్ల తర్వాత నోటీసులు ఇవ్వటం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఇళ్లు అమ్మేసుకున్నారు... ఆయా ఇళ్లు చేతులు మారాయి. కుటుంబ సభ్యులు/వారసులకు బదలాయించినవి మరికొన్ని ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతుల దరఖాస్తుల్లో తమను బాధ్యులను చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ఎల్‌టీపీ/లైసెన్సుడ్ ఇంజినీర్లు ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అన్నిశాఖల అధికారులు చెక్ చేసుకుని, నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతులు ఇస్తారని, ఇంతకాలం తర్వాత ‘షార్ట్‌ఫాల్స్’ నోటీసులివ్వటం సమంజసం కాదంటున్నారు.