
ఆరోగ్య భారతి సేవలు భేష్
మంత్రి సత్యకుమార్ యాదవ్
గుంటూరు మెడికల్: ఆరోగ్య భారతి సేవలు అభినందనీయం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సంస్థ రాష్ట్ర కార్యకర్తల ప్రాంత అభ్యాస వర్గ సమావేశం ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యభారతి సేవలు బాగున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రజారోగ్యం కోసం ఆరోగ్య భారతి వంటి సంస్థల సహకారంతో పనిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ సంఘటన కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్, సేవా భారతి కార్యదర్శి శ్రీరామశర్మ, జాతీయ సహ సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ రావు, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేఎస్‌ఎన్ చారి, క్షేత్ర సంయోజకులు కుమార స్వామి, ఏపీ సంఘటన కార్యదర్శి కాకాని పృథ్వీరాజ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జ్యుడిషియల్
ఆఫీసర్ల సదస్సు
గుంటూరు లీగల్: జిల్లా స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ సదస్సును జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సాయి కల్యాణ చక్రవర్తి నేతృత్వంలో ఆదివారం నిర్వహించారు. సదస్సుకు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హైకోర్టు న్యాయమూర్తి నైనాల జై సూర్య హాజరయ్యారు. న్యాయమూర్తుల పని తీరును, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబంధిత కోర్టులలో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు అందరూ హాజరయ్యారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా కోర్టు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలియజేశారు.