
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): విజయ వాడలో ఇటీవల జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తేదీన ఓ రౌడీషీటర్ రెచ్చిపోయి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్య చేసిన విషయం విదితమే. ఐదు రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తి నడిరోడ్డుపై రక్తపు మడుగులో మృతి చెందాడు. వరుస ఘటనలతో ప్రజలు హడలిపోతున్నారు.
రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి..
గుంటూరు జిల్లా మొగలాయిపాలెం గ్రామానికి చెందిన షేక్ సాదిక్ (28)కు నగరంలోని వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన కరిష్మతో 2019లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. సాదిక్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ విడాకులకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గుంటూరులోని తల్లి వద్దే ఉండేవాడు. ఈ నెల 16వ తేదీన విజయవాడ వెళ్లొస్తానని చెప్పి గుంటూరు నుంచి బయలుదేరాడు. 19వ తేదీన తల్లి రిహానాకు ఫోను కాల్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని తెలిపాడు. 20వ తేదీ తెల్లవారుజామున రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు.
కారణాలపై పోలీసుల దర్యాప్తు
సాదిక్ వాంబే కాలనీలో ఉన్న తన భార్యను కలిశాడా, లేదా అనే విషయం నిర్ధారణ కాలేదు. వాంబే కాలనీ నుంచి మధురానగర్ వైపు ఉన్న ట్రెండ్ సెట్ మార్గంలో అక్కడే బస్టాప్ వద్ద రెండు రోజుల నుంచి అతను తిరుగుతూ ఉన్నట్లు తెలిసింది. తమ కోడలికి వివాహేతర సంబంధం ఉందని, వారే తన కొడుకును హతమార్చి ఉండొచ్చని సాదిక్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాదిక్ మరణించిన సమయంలో ఒంటిపై దుస్తులు లేకపోవడం, మధురానగర్ వంతెన వద్ద తల పగిలి తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడి ఉండటం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సాదిక్ బ్యాగులో గంజాయి కూడా పోలీసులకు లభించినట్లు తెలిసింది. గంజాయి మత్తులో ఉండగా గంజాయి బ్యాచ్ సభ్యులకు, అతనికి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? వారే అతడిని హత్య చేసి ఉంటారా? ఏదైనా వాహనం ఢీకొని మరణించాడా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదుపులో అనుమానితులు
కరిష్మతోపాటు ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితులుగా కనిపించిన గంజాయి బ్యాచ్ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కరిష్మ మాత్రం భర్త అసలు ఇంటికే రాలేదని పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దంపతుల ఫోన్ కాల్ డేటాలను కూడా సేకరిస్తున్నారు. సాదిక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ రిపోర్టు ఆధారంగా సాదిక్ మృతికి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
గంజాయి బ్యాచ్ సభ్యులు హత్య చేసి
ఉంటారని అనుమానాలు
భార్య వివాహేతర సంబంధంపై
మృతుడి బంధువుల ఆరోపణ
పోలీసుల అదుపులో మృతుడి భార్య,
గంజాయి బ్యాచ్ సభ్యులు