
బారులు తీరి.. సారెనిచ్చి..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తబృందాలు సారెను సమర్పించాయి. ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 80 వేలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేసి, భక్తులందరిని అన్ని టికెట్ల క్యూలైన్‌లోకి ఉచితంగా అనుమతించి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న వంద మంది భక్తులలో దాదాపు 80 మంది చేతిలో అమ్మవారి సారె ఉండటం విశేషం. అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో మహా మండపం 5వ అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారిని మహా నివేదన సమర్పించేందుకు గాను అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా త్వరతిగతిన దర్శనం అయ్యేలా ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు సమన్వయంతో చర్యలు తీసుకున్నారు.
కిటకిటలాడిన ఆరో అంతస్తు..
మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని సారెను చూపేందుకు భక్త బృందాలు క్యూ కట్టాయి. ఉదయం 10 గంటల తర్వాత భక్త బృందాలతో ఆరో అంతస్తు కిటకిటలాడింది. అమ్మవారికి సారెను చూపేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మహా మండపం లిఫ్టు, మెట్లమార్గంతో పాటు ఘాట్‌రోడ్డు, పాత మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం ఆరో అంతస్తుకు చేరి సారెను సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఆదివారం ఉదయం నుంచే అంతరాలయ దర్శనాలను ఆలయ ఈవో శీనానాయక్ రద్దు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను సైతం నిలిపివేసి, బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కనిపించింది. మహా మండపం లిఫ్టు మార్గం ద్వారా కేవలం వికలాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, నడవలేని వారికి మాత్రమే కొండపైకి తీసుకెళ్లారు.

బారులు తీరి.. సారెనిచ్చి..

బారులు తీరి.. సారెనిచ్చి..