
వైభవంగా పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజుల పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం అర్చకులు, వేదపండితులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో ఇవి జరిగాయి. ఈ పవిత్రోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఉదయం అన్నదానం, సాయంత్రం ప్రత్యేక వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు. పూజా కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, అర్చకులు, దాతలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గిరిజా కల్యాణం
పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం గిరిజా కల్యాణ పోస్టర్‌ను వైశ్యకుల గురువు వామనాశ్రమ మహా స్వామీజీ ఆవిష్కరించారు. ఈ నెల పది నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు చాతుర్మాస దీక్షలో భాగంగా 27న గిరిజా కల్యాణం నిర్వహిస్తున్నట్లు చాతుర్మాస సేవా సమితి కన్వీనర్ తటవర్తి రాంబాబు తెలిపారు. కల్యాణంలో పాల్గొనేందుకు 94406 05773 ఫోను నంబర్‌లో సంప్రదించాలని అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో గుడివాడ రవి, జుజ్జూరు శ్రీనివాసరావు, బాపారావు, కోటా శేషగిరి, మహంకాళి శ్రీనివాసరావు, సునీత, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.
బగళాముఖి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886
కర్లపాలెం: చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.6,09,886 వచ్చినట్లు ఆలయ ఈవో జి.నరసింహమూర్తి తెలిపారు. గురువారం బాపట్ల డివిజన్ దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎం.గోపి, చందోలు ఎస్‌ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ పర్యవేక్షణలో పొన్నూరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ నాగరాజు ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బందితోపాటు అమ్మవారి భక్తులు హుండీ నగదు లెక్కించారు. ప్రతి మూడు నెలలకు అమ్మవారి హుండీ నగదు లెక్కిస్తున్నామని ఈవో తెలిపారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
భట్టిప్రోలు: పిడుగుపాటుకు గురై బాపట్ల జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం ఓలేరు శివారు వెంకటరాజు నగర్‌కు చెందిన గుంటూరు లూదు మరియన్న (70) పొలంలో పని చేస్తుండగా గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వర్షం ఆరంభమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో సమీపంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. అత్యంత సమీపంలో పిడుగు పడింది. దీంతో మృతి చెందాడు. గమనించిన స్థానికులు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు.
మహిళ కూడా...
సంతమాగులూరు(అద్దంకి): పిడుగు పాటుకు మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండలంలోని ఏల్చూరు గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన వారు పొలాల్లో గేదెలు మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు ధాటికి పద్మ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయడిన వ్యక్తిని వైద్యశాలకు తరలించారు.

వైభవంగా పవిత్రోత్సవాలు

వైభవంగా పవిత్రోత్సవాలు