
నానో ఎరువుల వినియోగం పెంచాలి
కొరిటెపాడు(గుంటూరు): నానో ఎరువుల వినియోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇఫ్కో ఆధ్వర్యంలో కృషీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన నానో ఎరువుల విక్రయదారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నానో యూరియా, డీఏపీ, జింక్, కాపర్ వాడటం వల్ల కాలుష్యం తగ్గుతుందని స్పష్టం చేశారు. ధరల భారం ఉండదన్నారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి సారం కోల్పోతుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి వీరాచారి మాట్లాడుతూ నానో ఎరువులను రైతులు వాడాలని సూచించారు. ఒక బాటిల్ నానో యూరియా పిచికారి చేస్తే ఒక బస్తా యూరియా చల్లినట్టేనని తెలిపారు. ఇఫ్కో నానో డీఏపీ అన్ని పంటల్లో నత్రజని, భాస్వరం లోపాలను సరిచేయడంలో సహాయ పడుతుందని వివరించారు. సమావేశంలో నాబార్డు డీడీఎం శరత్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు సురేంద్ర, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
అయితా నాగేశ్వరరావు