
మైక్రో ఆర్టిస్ట్ మహితకు బాపట్ల కలెక్టర్ సాయం
బాపట్ల : చీరాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తన అద్భుతమైన కళా ప్రతిభతో మహిత 93 ఫెన్సిల్స్‌పై నెల్సన్ మండేలా జీవిత చరిత్రను, మరో 810 ఫెన్సిల్స్‌పై మహాభారతంలోని 700 శ్లోకాలను అత్యంత సూక్ష్మంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నారు. మహిత అసాధారణ ప్రతిభను కలెక్టర్ మురళి అభినందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తన వంతు సహాయంగా రూ.15వేలు చెక్కు రూపంలో మహితకు అందజేశారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టర్ తీసుకున్న ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.