
టీడీపీ కార్యకర్తల రాక్షసానందం
గుంటూరు వెస్ట్: దళితుల సమస్యలు వినేందుకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకర్ సమావేశ మందిరానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్‌ను తప్పుదోవ పట్టించేందుకు పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనుచరులు నానా హంగామా సృష్టించారు. హత్యాయత్నానికి గురై ప్రాణాలతో పోరాడుతున్న మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావును, వైఎస్సార్ సీపీ నాయకులను నానా దుర్భాషలాడారు. ఒక సందర్భంలో అరడజను మంది డీఎస్సీలు, సిబ్బంది వచ్చినా వారిని ఆపలేకపోయారు. ఒక పక్క మీటింగ్ జరుగుతుండగానే తమను లోపలికి పంపాలని, లేకపోతే ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామని రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తారు. దీంతో పోలీసులు చేసేది లేక 10 మందిని లోపలికి తీసుకెళ్లి వినతిపత్రం ఇప్పించారు.
నెంబర్ ప్లేట్‌పై జై తెలుగు దేశం
పెద్దఎత్తున వచ్చిన టీడీపీ కార్యకర్తలు కార్లకు నంబర్లు కూడా తీసేశారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నంబర్‌కు బదులు జై తెలుగుదేశం అని రాసుకున్నారు. కొందరు దళిత సంఘాల నాయకులు దీన్ని వ్యతిరేకించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు యథావిధిగా టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరించారు.