
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగి కస్తూరి కృష్ణవేణి మాట్లాడుతూ జెడ్పీ కార్యాలయంతో పాటు చైర్‌పర్సన్ క్యాంపు కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. తనతో పాటు తేళ్ల హరీష్, వాసిమళ్ల అరుణ, కొల్లిపర రాహుల్, కె.ఆనంద్, వరికూటి నందినిలకుగత 22 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పేదవారిపై జాలి చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద ప్రేమానందం మాదిగ మాట్లాడుడూ జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో నిర్లక్ష్య వైఖరితోనే వేతనాలు చెల్లింపులకు నోచుకోవడం లేదని ఆరోపించారు. వాచ్‌మేన్‌గా పని చేస్తున్న పిడపర్తి కృష్ణవేణి భర్త అనారోగ్యంతో మరణించగా, కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోకపోగా ఆమెకు 22 నెలల జీతం కూడా ఆపేశారని ఆరోపించారు. నిరుపేద కార్మికులపై అధికారులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
జెడ్పీ కార్యాలయం వద్ద
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన