
విత్తన చట్టంతో నకిలీలకు కళ్లెం
● ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్స్ ప్రదర్శించాలి ● కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరి
కొరిటెపాడు(గుంటూరు): ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ప్రైవేటు దుకాణాల్లో విత్తనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే, రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగించే చర్యలకు కళ్లెం వేసేందుకు విత్తన చట్టం ఉంది. దాని గురించి రైతులకు తెలియదు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అన్యాయం జరిగితే డీలర్లపై కఠినతరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. విత్తన చట్టం– 1966, విత్తన నిబంధనలు– 1968, విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 తదితర చట్టాలు రైతులకు అండగా నిలుస్తాయి. విత్తనపరమైన అతిక్రమణలు, ఉల్లంఘనలు వర్తించే విధంగా వీటిని రూపొందించారు. విత్తన విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారిపై నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు– 3 అతిక్రమించినందుకు జప్తు చేయవచ్చు. అత్యవసర సరుకుల చట్టం 1955 సెక్షన్–ఏ ప్రకారం జరిమానాకు గురవుతారు.
విత్తన లైసెన్సు ప్రదర్శన తప్పనిసరి
ప్రైవేటు విత్తనాల విక్రయ దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్సును ప్రదర్శించాలి. లేనిపక్షంలో అధికారులు అమ్మకాలను నిలిపివేయవచ్చు. అంతేకాకుండా నోటీసు ఇస్తూ దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు–5 ప్రకారం డీలర్ లైసెన్సు సస్పెండ్ లేదా రద్దు చేయవచ్చు.
ధరలు, స్టాకు బోర్డు ఏర్పాటు తప్పనిసరి
విత్తనాలు విక్రయించే దుకాణాల్లో కచ్చితంగా ధరలు, స్టాకు బోర్డులను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1083 క్లాజు 8 ప్రకారం ఆయా దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేయవచ్చు. అధికారులు వచ్చి ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు.
అమ్మకాల రశీదు ఇవ్వాల్సిందే !
విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు ఆయా దుకాణదారుడు కచ్చితంగా రశీదు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో విత్తన నియంత్రణ ఉత్తర్వులు–1983 క్లాజు 9 ప్రకారం ముందుగా నోటీసు జారీ చేయవచ్చు. దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే డీలర్ లైసెన్సు రద్దు చేయవచ్చు.
విత్తనాల బస్తాలపై లేబుల్ లేకపోతే చర్యలు
డీలర్ దగ్గర కొనుగోలు చేసిన విత్తనాల బస్తాలకు లేబుల్ లేకపోతే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. అంతే కాకుండా ఆయా విత్తనాలను జప్తు చేసే అధికారం ఉంది. అత్యవసర సరుకుల చట్టం–1955 సెక్షన్ 7 ప్రకారం జరిమానా విధిస్తారు. కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం–1966 సెక్షన్ 7 ప్రకారం, విత్తన నియంత్రణ ఉత్తర్వులు –1983 క్లాజు 8ను అనుసరిస్తూ డీలర్ లైసెన్సు సస్పెండ్, రద్దు చేయవచ్చు.
జిల్లాలో ఇలా..
గుంటూరు జిల్లాలో 600 ప్రైవేటు డీలర్ల దుకాణాలు ఉన్నాయి. ఇందులో 400 మంది విత్తనాల డీలర్లు, 100 మంది ఎరువుల డీలర్లు, మరో 100 మంది పురుగు మందుల డీలర్లు ఉన్నారు.
నిబంధనలు పాటించాలి
విత్తన చట్టానికి అనుగుణంగా డీలర్లు విక్రయించాలి. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలతో పాటు దుకాణాల లైసెన్సును రద్దు చేసే పరిస్థితి ఉంటుంది.
– అయితా నాగేశ్వరరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, గుంటూరు

విత్తన చట్టంతో నకిలీలకు కళ్లెం