
ఓడీఓపీ అవార్డు అందుకున్న కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: ఒకే జిల్లా–ఒకే ఉత్పత్తి కింద గుంటూరు మిర్చికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి దక్కడం చాలా గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బంగారు కేటగిరి అవార్డును కలెక్టర్ అందుకున్నారు. కలెక్టర్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సహాయ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి జిటిఎన్ ప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ, ,చేనేత పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.సునీతలు అభినందించారు.
రైతులకు సరిపడా ఎరువుల సరఫరాకు ప్రణాళిక
జిల్లా వ్యవసాయ అధికారి
అయితా నాగేశ్వరరావు
కొరిటెపాడు (గుంటూరు): పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి అన్ని రకాల ఎరువులు కావాల్సిన మేరకు అంచనా వేసి, దానికి అనుగుణంగా నెలవారీ సరఫరా ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వివిధ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,14,725 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు వరి 6,433 హెక్టార్లు, పత్తి 1,632 హెక్టార్లలో సాగైనట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 166.3 సెంటీ మీటర్లకు గానూ 75.2 సెంటీ మీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు పేర్కొన్నారు. జిల్లాలో టోకు వర్తకులు, రిటైల్ డీలర్ల వద్ద యూరియా 15,021 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,252, కాంప్లెక్స్ ఎరువులు 13,797, ఎంఓపీ 946 మొత్తం కలిపి 34,016 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎరువుల సరఫరాలో సమస్యలుంటే సంబంధిత రైతు సేవా కేంద్రం ద్వారా మండల వ్యవసాయ అధికారికి గానీ, సహాయ వ్యవసాయ సంచాలకులకు గానీ, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబరు–8074994631కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో సోమవారం సంకటహరచతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రేపటి నుంచి శివాలయంలో పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి రాహుకేతువు పూజలు, నవగ్రహపూజలు, రుద్ర, చండీ హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, శాంతి కల్యాణాలతో పాటు అన్ని సేవలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. 19వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కై ంకర్యాలు, అన్ని ఆర్ణీత సేవలు, రాహుకేతు పూజలు, యథావిధిగా జరుగుతాయన్నారు. దేవస్థానంలో వాహనపూజలు, అన్నప్రాసనలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.