
రాజకీయ నేపథ్యంలోనే హత్యాయత్నం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి రాజకీయపరంగా జరిగిన హత్యాయత్నం అని, దాడి జరిగినప్పటి వీడియో చూస్తే ఎవరికై నా ఇది స్పష్టంగా అర్థమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ పది రోజుల కిందట టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావు దేవుడి దయతో కోలుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయనది సంస్కారవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన విద్యావంతుల కుటుంబమని, వాళ్ల మీద దాడి జరగడం రెండోసారని వివరించారు. వీరి కుటుంబం అట్టడుగు వర్గం నుంచి వచ్చినా ప్రజల పక్షాన నిలబడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ ఆయనపై దుర్మార్గంగా జరిగిన దాడిపై కుటుంబసభ్యులతోపాటు పార్టీ కూడా తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు. తనపై కూడా దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే అది తీసుకోకుండా..అధికార పార్టీ వాళ్లు ఇచ్చిన ప్యాబ్రికెటెడ్ కంఫ్‌లైంట్‌తో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో స్పష్టంగా వీడియో సాక్ష్యం ఉన్న నేపథ్యంలో నెల, రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలని, నిందితులకు శిక్ష పడాలని ఆయన వివరించారు. అది వదిలేసి నిందితులను ఎలా తప్పించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని ఆరోపించారు. కుట్రకు రెచ్చగొట్టిన ఎమ్మెల్యే నరేంద్ర వైపు చూడకుండా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో ఉన్న దుస్థితికి, పోలీస్ రాజ్యానికి నిదర్శనమని తెలిపారు.
ప్రేక్షక పాత్రలో పోలీసులు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్టినేటర్
సజ్జల రామకృష్ణారెడ్డి
మన్నవ గ్రామ సర్పంచ్
నాగమల్లేశ్వరరావుకు పరామర్శ
ఏడాది కిందట పెదకూరపాడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ ఈదా సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు, చేతులు నరికితే ఇంత వరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేయమని ప్రభుత్వ పెద్దలే బాహాటంగా చెబుతున్నారని, దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేస్తే కేసులు కూడా పెట్టడం లేదని విమర్శించారు. చర్యలు అసలు లేకుండా పోతున్నాయన్నారు. గుంటూరులో లక్ష్మీనారాయణను సాక్షాత్తూ డీఎస్పీ ఈ కులంలో ఎలా పుట్టావు అంటూ వేధించడంతో అవి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడని సజ్జల పేర్కొన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, అందుకు కారణమైన డీఎస్పీ హనుమంతరావు మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెనాలిలో బహిరంగంగా రోడ్డు మీద యువకులను చితకబాదిన వ్యవహారంలో కూడా ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.