
విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర
ప్రత్తిపాడు: అక్రకటిత విద్యుత్ కోతలపై మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. ప్రత్తిపాడు ఒకటో వార్డులోని పూల బజారులో కొద్ది నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్య నెలకొంది. లో వోల్టేజీ సమస్యతో పాటు ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు కోత విధించడంతో స్థానిక మహిళలు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోండని చులకన చేసి మాట్లాడుతున్నారు. దీంతో మహిళలు, స్థానికులు ఆదివారం రాత్రి గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? అందరిలానే తాము నెల నెలా వేలకు వేలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదా? అంటూ మండిపడ్డారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయారు. ఇంట్లో వృద్ధులు, పసి పిల్లల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతమద్రాసు రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నాగేంద్ర రోడ్డు మీద ఆందోళన విరమించాలని కోరారు. ఏఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని మహిళలు పట్టుబట్టారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడతామని పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ప్రత్తిపాడులోని పాత మద్రాసు
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
వేలకు వేలు బిల్లులు కట్టించుకోవడం
లేదా అంటూ మండిపాటు
విద్యుత్‌శాఖ అధికారులకు చెప్పినా
పట్టించుకోవడం లేదని ఆగ్రహం

విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర