
మల్లేశ్వరస్వామి దేవస్థానానికి తులాభారం బహూకరణ
పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు. దేవస్థానంలో స్వామివారికి భక్తులు మొక్కు బడులు తీర్చుకొనడానికి తులాభారం ఉపయోగంగా ఉంటుందని ఆయన చెప్పారు. దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
వివాదాస్పద పీఈటీపై
విచారణకు ఆదేశం
పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్‌సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్‌లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సీసీ విద్యార్థులు ఏసర్టిఫికెట్ పొందేందుకు యూనిఫాం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు నంబూరు పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీశారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో ఎన్‌సీసీ విద్యార్థుల నగదు స్వాహా పేరుతో కథనం వెలువడింది. దీనిపై జిల్లా ఉప విద్యాశాకాధికారి రత్నంను విచారణాధికారిగా నియమించినట్లు డీఈఓ సీవీ రేణుక వెల్లడించారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నారాయణస్వామికి
లక్ష తులసీ దళార్చన
నగరంపాలెం: గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/7వ అడ్డరోడ్డులో వేంచేసిన శ్రీగౌరీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం శతాబ్ది మహోత్సవాలు ఆదివారం కొనసాగాయి. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనారాయణస్వామికి సుదర్శన, అష్టాక్షరీ మంత్ర హోమాలు, భక్తులతో నారాయణ సూక్తులతో హోమాలు జరిగాయి. సాయంత్రం నారాయణస్వామికి లక్ష తులసీ దళార్చన, నీరాజన మంత్ర పుష్పాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
15 మందికి షోకాజ్
నోటీసులు
నెహ్రూ నగర్ : ప్రజలకు అందించే అత్యవసర సేవలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం హెడ్ వాటర్ వర్క్స్‌లో పనిచేస్తున్న 15 మంది సిబ్బంది నగరంలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఆప్కాస్ కార్మికులకు ఆదివారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆప్కాస్ కార్మికుల్లో కొందరు అత్యవసర తాగునీటి సరఫరాకు అంతరాయం కల్గిస్తూ ఆదివారం విధులకు గైర్హాజరయ్యారు. కార్మికుల గైర్హాజరు వల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగింది. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించిన వారిలో 15 మందికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కాకుంటే కఠిన చర్యలు ఉంటాయని నగర కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు.