
ఆశీలు పేరుతో దోపిడీ
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆశీలు వసూలు దందా నడుస్తోంది. వసూలు చేసేవారు వ్యాపారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన నగదుకు బిల్లు అడుగుతుంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఒకవేళ ఇచ్చినా ఎంత చెల్లించామన్నది రాయడం లేదని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ, రూరల్ పరిధిలో పలుచోట్ల వసూలు చేసేవారు చిరు వ్యాపారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
వాయిదా పడిన ఆశీల రద్దు
గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఆశీలును రద్దు చేస్తామని ప్రకటించారు. ఈలోపు ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. అనంతరం ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ఎన్నికై విద్య, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత మంగళగిరిలో వ్యాపారులకు శుభవార్త అంటూ ఆశీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టి కార్పొరేషన్ అధికారులు టెండర్లను పిలిచారు. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు పాటను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నాడని, ఇదేమని అడిగితే తన మనుషులతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడనే విమర్శలు వ్యాపారుల నుంచి వినిపిస్తున్నాయి.
బిల్లు ఇవ్వడం తప్పనిసరి
ఆశీల వసూలుకు టెండర్లు పిలిచిన మాట వాస్తవమే. నిబంధనలకు విరుద్ధంగా నగదు వసూలు చేస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ నిర్ణయించిన మేరకే వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసి బిల్లు తప్పకుండా ఇవ్వాలి.
–మురళి, ఆర్వో
బిల్లు అడిగిన వారిపై దౌర్జన్యం
మంత్రి మాటలను పెడచెవిన
పెట్టిన అధికారులు
చిరు వ్యాపారులపై ప్రతాపం
దుగ్గిరాల మండల చిలువూరు నుంచి ఓ వృద్ధురాలు వేరుశనగ కాయలు, గుగ్గిళ్లు అమ్ముకునేందుకు చిలువూరు దగ్గర రైలు ఎక్కి తాడేపల్లి వద్ద దిగి పలు ప్రాంతాల్లో అమ్ముకుంటుంది. వ్యాపారం జరగకుండానే డబ్బులు కట్టాలని ఆమె ఆశీలు వసూలు చేసేవారు డిమాండ్ చేశారు. గంట తరువాత కడతామని చెప్పినా వినలేదు. ఆమె నుంచి 30 రూపాయలు వసూలు చేసి, బిల్లు మాత్రం ఇవ్వలేదు. ప్రతి రోజూ ఇదే మాదిరి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ, పాతూరు, వడ్డేశ్వరం, మెల్లెంపూడి, ఇప్పటం, చిర్రావూరు ప్రాంతాల్లో మాంసం, చేపలు అమ్మేవారి వద్ద నగదు అయితే వసూలు చేస్తున్నారు గానీ దానికి సంబంధించి బిల్లు మాత్రం ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్నారు. ఒకే రసీదుపై ధర వేయకుండా వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారు.