ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక

Jul 11 2025 5:51 AM | Updated on Jul 11 2025 5:51 AM

ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక

ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళిక

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

తెనాలి అర్బన్‌: వచ్చే ఏడాది మార్చి నాటికి తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్‌ బాలురోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఏడాది రోడ్ల మరమ్మతులు, విస్తరణపై దృష్టి సారించినట్లు చెప్పారు. రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలను గుర్తించి, వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్స్‌ను కూడా డెవలెప్‌ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.36వేల కోట్లు వెచ్చిస్తోందని, ఆ స్థాయిలో ఫలితాలు రావడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేస్తామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందంగా, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాఠశాలలో డ్రాప్‌ అవుట్స్‌ లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాడిబోయిన రాధిక, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో సీవీ రేణుక, ఈగల్‌ విభాగ ఎస్పీ కె.నగేష్‌బాబు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అత్తోట నాగవేణి, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ వీఎం.లక్ష్మీపతిరావు, తహసీల్దార్‌ గోపాలకృష్ణ, ఎంఈవో–2 వి.జయంతిబాబు, డెప్యూటీ డీఈవో శాంతకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఐ.పద్మావతి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ వి.శాంతి, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement