
ఐకమత్యంతోనే శత్రువుపై విజయం
● జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపు ● మోసానికి బ్రాండ్ అంబాసి‘డర్’ బాబు ● అధికారం కోసమే తప్పుడు హామీలు ● మోసం చేసి ఎన్నికల్లో గెలుపు
పట్నంబజారు: రాష్ట్రంలో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది మోసమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ స్కానర్ పోస్టర్‌లను ఆవిష్కరించారు.
సుపరిపాలన కాదు..
మోసాల పాలన
అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఏడాదిలో సుపరిపాలన అందించామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, ప్రజలు సంతోషంగా ఉంటేనే సుపరిపాలన అవుతుంది తప్పా, సంక్షోభం ఉంటే కాదని తెలిపారు. 40 శాతం ఓట్లు వచ్చిన వైఎస్సార్ సీపీకి 40 సీట్లు రాలేదని, అందులో కచ్చితంగా సాంకేతిక లోటుపాట్లు, మోసాలున్నాయని ఆరోపించారు. ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్‌లలో తాము పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. స్కానర్‌లను చూపించి చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు పరిచిన పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి, తీరా కొంత మందికి మాత్రమే రూ. 13వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. రెండో బిడ్డ ఉంటే కేవలం రూ. 10వేలు పడుతుందని పలువురు చెబుతున్నారన్నారు. సూపర్ –6 అన్ని ఇచ్చేశామని, అడిగిన వారి నాలుక మందమనే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అంబటి ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే 30 నుంచి 40 మందికి దీపం పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో సాగిందంతా కేసులు పెట్టడం, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటలను అడ్డుకునే దుస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందని తెలిపారు. విభేదాలను పక్కనబెట్టి భవిష్యత్తులపై శత్రువుపై విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే ఓనర్లు
వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే ఓనర్లు అని పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. కష్టకాలంలో పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధికారం కోల్పోయాక నేతలు పక్క పార్టీలోకి వెళ్లారు తప్పా, కార్యకర్తలు ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను చూస్తే రాజ్యాంగం గుర్తుకు వస్తుందని, మహాత్మాగాంధీని చూస్తే స్వాతంత్య్రం గురించి తెలుస్తుందని, భవిష్యత్తు తరాలు పక్కవారిని మోసం చేయాలంటే చంద్రబాబు విగ్రహానికి దండం పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ మరణం తరువాత ఆయన విలువ తెలిసిందని, 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి తరువాత ప్రజలకు విలువ తెలిసొచ్చిందని తెలిపారు. చంద్రబాబు అబద్ధాలతోనే వైఎస్సార్ సీపీ ఓటమి పాలైందని, కచ్చితంగా అందుకు బదులు తీర్చుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే అంటే ఎం అంటే మోదుగుల, ఎల్ అంటే లేళ్ల అప్పిరెడ్డి, ఏ అంటే అంబటి రాంబాబు అని, తామంతా ఐకమత్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఎన్నికల తరువాత హామీలపై చంద్రబాబును నిలదీయలేకపోతున్న పవన్ కల్యాణ్‌కు సిగ్గు లేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకుడని చెప్పుకుంటున్నాడని, అతను చేసే అన్యాయాల్లో సగ భాగం కూడా పంచుకుంటున్నావా ? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా శ్రేణులు ముందుకు సాగాలని చెప్పారు. ‘బాబు షూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు సి.డి.భగవాన్, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, పఠాన్ సైదాఖాన్, దానం వినోద్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సురసాని శ్రీనివాసరెడ్డి, పార్టీ మహిళ విభాగం నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జిల్లా, నగర కమిటీ నేతలు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
అధికారం కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుదోవ పట్టించిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే దిశగా ప్రతి ఇంటికి వెళ్లే ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానాలను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వై.ఎస్.జగన్ మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా చూస్తే, బాబు దాన్ని బుట్టదాఖలు చేశారని మండి పడ్డారు. ఏడాదిలోపే అనేక ఉద్యమాలతో ప్రజలకు, రైతన్నలకు, విద్యార్థి యువజనులకు, మహిళలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచిందని తెలిపారు. కూటమి పాలన ప్రారంభించిన నాటి నుంచి అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో కాలం వెళ్లదీస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క భయానికి తలవంచకుండా ఎత్తిన జెండాను భుజాన దించకుండా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

ఐకమత్యంతోనే శత్రువుపై విజయం

ఐకమత్యంతోనే శత్రువుపై విజయం

ఐకమత్యంతోనే శత్రువుపై విజయం