
రాష్ట్రం రావణ కాష్టం
కూటమి పాలనలో
పట్నంబజారు: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రావణ కాష్టంగా మారుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపేనని, వారు ఎదుగుతుంటే ఆయన ఓర్చుకోలేరని విమర్శించారు.టీడీపీ గూండాల చేతిలో దాడికి గురై, గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షించారు. శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ నేతలతో కలిసి రమేష్ ఆస్పత్రికి వచ్చారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన్ని స్వయంగా చూసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు కోలుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
నరేంద్ర ప్రోద్బలంతోనే దాడి
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిందని మండిపడ్డారు. గీటు దాటితే భూస్థాపితం చేయాలని మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని తెలిపారు. దశాబ్దాలు తరబడి ప్రజలకు సేవలందిస్తున్న ఒక దళిత కుటుంబంపై ఘోరమైన దాడులు చేయడం సిగ్గుచేటని ఖండించారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని, హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదని ధ్వజమెత్తారు. కచ్చితంగా ఎమ్మెల్యే నరేంద్రను ఏ–1గా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పెరిగిన హత్యలు
ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని తెలిపారు. కూటమి ఏడాది పాలన మొత్తం కేవలం వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా కొనసాగిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటని ఖండించారు. హింసావాద రాజకీయాలను కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగానే ప్రోత్సహి స్తోందని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి మేరుగ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసిన నేతలు