
తిరువూరు సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
తిరువూరు: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ బాణోతు జగన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడు రోజుల క్రితం ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు సమాచారం బయటికి పొక్కకుండా గుట్టుగా ఉంచారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నానీకి తుళ్లూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఆయన ప్రమేయం లేకుండా శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి మరొకరికి విక్రయించినట్లుగా తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానంలో సబ్ రిజిస్ట్రార్ జగన్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై కోవెలమూడి నాని రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం తిరువూరు సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీచేశారు. తొమ్మిది నెలల క్రితం తిరువూరు సబ్ రిజిస్ట్రారుగా వచ్చిన జగన్ ఇదే తరహాలో కొందరు దస్తావేజు లేఖరులు, దళారులు, ప్రైవేటు వ్యక్తులు తెచ్చిన దస్తావేజులను ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలో ఏ పనికై నా బహిరంగంగానే అదనపు డబ్బు వసూలు చేసినట్లు కక్షిదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే తిరువూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో అక్రమాలు వెలికి వచ్చే అవకాశం ఉంది.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్‌ఐ 9121102168 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
20న స్వర్ణలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ
బాపట్ల: కారంచేడు మండలం స్వర్ణలో ఈ నెల 20న ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు పి.కొండయ్య చెప్పారు. శుక్రవారం బాపట్లలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండయ్య మాట్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ఏ పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు కౌలు రేట్లు పెంచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కౌలు రైతుకు ఇచ్చే రాయితీలు అందడం లేదని అన్నారు. ఈ సమస్యలపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. సభలకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు సిహెచ్.గంగయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామారావు హాజరవుతారని తెలిపారు.