తిరగబడ్డ రైతుబిడ్డ | - | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ రైతుబిడ్డ

Jul 12 2025 9:37 AM | Updated on Jul 12 2025 9:37 AM

తిరగబ

తిరగబడ్డ రైతుబిడ్డ

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది.

పొంతన లేని లెక్కలు

ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్‌ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయబ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్‌ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తలాతోక లేని అభిప్రాయ సేకరణ

తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878 ఎకరాలు, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504 ఎకరాలు, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 ఎకరాలు కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్‌ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది.అయితే గెజిట్‌తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వమని స్పష్టంగా తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు.

అడ్డం తిరిగిన రైతులు

నోటిఫికేషన్‌కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మధ్యలోనే వెనుతిరిగారు.

ఎదురు తిరిగిన పార్టీ నేత

మొదటి దశలో భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేసిన తరువాతే రెండోదశ పూలింగ్‌కు వెళ్లాలంటూ సీఆర్డీయే సిటిజన్‌ కమిటీ సమావేశంలో సభ్యుడిగా ఉన్న రాజధాని ప్రాంత టీడీపీ సీనియర్‌ నాయకుడు స్పష్టం చేశారు. అసలు సొంత పార్టీ నేతలే ఎదురుతిరగడంతో చంద్రబాబు మాట మార్చారు. రెండో దఫా భూసమీకరణను కుదించారు. తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాలు, అమరావతి మండలంలో కొన్ని గ్రామాలకే పరిమితం చేశారు. అయినప్పటికీ పెదపరిమి గ్రామ రైతులు బహిరంగంగా మైకులు పెట్టి మరీ భూములివ్వం అంటూ ఎదరుతిరగడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సేకరణ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కొనేందుకు యత్నిస్తోందని, తాము తిరగబడతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కనుమరుగు చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నట్టేట ముంచుతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బాబు తాత్కాలికంగా ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం.

రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినెట్‌ నిర్ణయం వాయిదా అడ్డం తిరిగిన పొన్నెకల్లు, నిడుముక్కల రైతులు ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినాదాలు సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత భూ సమీకరణలో లేని గ్రామాల్లో కూడా సభలు మొదటికే మోసం వస్తుందన్న భయంతో తాత్కాలికంగా వాయిదా

భూములు ఇవ్వమని గ్రామాల్లో మైక్‌ ప్రచారం

సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూసమీకరణకు తాము భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్‌ ప్రచారం కూడా చేయడం సంచలనంగా మారింది.

తిరగబడ్డ రైతుబిడ్డ 1
1/2

తిరగబడ్డ రైతుబిడ్డ

తిరగబడ్డ రైతుబిడ్డ 2
2/2

తిరగబడ్డ రైతుబిడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement