
మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సాయి కల్యాణ్ చక్రవర్తి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో గల కార్యాలయంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మీడియేషన్(మధ్యవర్తిత్వం)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా 90 రోజుల ఇంటెన్సివ్ డ్రైవ్‌ను నిర్వహించి కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయవాదులందరూ మీడియేషన్‌పై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు ద్వారా నియమించబడిన అడ్వకేట్‌లు, సీనియర్ ట్రైనర్లు సుదర్శన సుందర్, విజయ కమల మీడియేషన్‌పై అవగాహన కల్పించారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తాడికొండ: తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో శుక్రవారం జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ఫైనాన్స్ – ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పరిశీలించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవికుమార్, రమణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్, డీపీఓ నాగ సాయికుమార్, సీఆర్డీఏ ఈఈ శ్రీనివాసరావు, డీఎస్‌డబ్ల్యూఆర్‌ఐ సురేష్, తుళ్లూరు, గుంటూరు తూర్పు తహసీల్దారులు సుజాత, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దాడి కేసు ప్రథమ నిందితుడు?
తెనాలి రూరల్: తెనాలిలో కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు ఏప్రిల్‌లో దాడి చేయడం, అందులో ముగ్గురికి పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కన్నా చిరంజీవి విధులకు వెళుతుండగా ఏప్రిల్ 24వ తేదీ రాత్రి ఐతానగర్‌లో నలుగురు యువకులు అతడిపై దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐతానగర్‌కు చెందిన వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నవీన్ పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని పోలీసులు ఏప్రిల్ 27న అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివాదం జరిగిన రోజున కానిస్టేబుల్ చిరంజీవికి, నవీన్‌కు మధ్య ఘర్షణ జరిగిందని, జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్ అక్కడే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పొరుగున ఉన్న బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్న నవీన్ గురువారం బయటకు రావడంతో నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
శాకంబరిగా బాల చాముండేశ్వరి
అమరావతి: అమరావతి బాల చా ముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు.

మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం

మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరం