ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి

Jul 11 2025 5:51 AM | Updated on Jul 11 2025 5:51 AM

ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ఎమ్మెల్యే నరేంద్రపై అట్రాసిటీ కేసు పెట్టాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: దళిత సర్పంచ్‌పై టీడీపీ గూండాలతో దాడి చేయించిన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో గుంటూరులోని రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్‌ బొనిగల నాగ మల్లేశ్వరరావును గురువారం పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి ఆయన పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

నరేంద్రను ఏ–1గా చేర్చాలి

సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా చైతన్యవంతమైన పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగంగా చేసిన వ్యాఖ్యల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు. మన్నవ గ్రామ సర్పంచ్‌పై దాడి ఘటనలో నరేంద్రను ఏ–1గా చేర్చాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో పెద్ద నాయకుడైన నాగమల్లేశ్వరరావు ఆధిపత్యాన్ని సహించలేక అతనికి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నాయకుడిని ఉసికొల్పి, ఇద్దరు దళితుల మధ్య హత్యాకాండకు నరేంద్ర తెరతీశాడని ఆరోపించారు. ఆయన చేసిన పాపం ఊరికే పోదని తెలిపారు. వారం రోజులు గడిచినా నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యా రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. వినుకొండలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను నడిరోడ్డుపై నరికి చంపితే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌ పేరుతో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లు ఎల్లకాలం అధికారంలో ఉండరని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైఎస్‌ జగన్‌ అని, వచ్చేది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు దళిత ఎమ్మెల్యులు ఉన్నా దాడులను ఖండించక పోవడం సిగ్గుచేటని ఖండించారు. వారు తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. చైతన్యవంతులైన మాల, మాదిగ ప్రజలు, విద్యావంతులు దళిత వ్యతిరేకిగా ఎమ్మెల్యే నరేంద్ర సాగిస్తున్న అరాచకాలపై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కారు కింద పడి మరణించిన గోవతోటి రాంబాబు మృతి విషయాన్ని బయటకు పొక్కకుండా రూ.10 లక్షలతో రాజీ కుదుర్చుకున్నారని వెల్లడించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు శీలం పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్‌, నాయకులు సురేంద్ర, బూదాల శ్రీనివాసరావు, ఎండీ గోరేబాబు, డేవిడ్‌రాజు, ముగ్గు గవాస్కర్‌, శామ్యూల్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త

అంబటి మురళీకృష్ణ డిమాండ్‌

ఆస్పత్రిలో నాగమల్లేశ్వరరావుకు పరామర్శ

పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement