
తెలుగు సాహిత్యానికి అన్నమయ్య కృషి అసామాన్యం
గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు సాహిత్యం, సంగీతం, కవితా వికాసానికి తాళ్లపాక అన్నమాచార్యుల కృషి అసామాన్యమని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి హిమ శైలజ అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో శుక్రవారం అన్నమయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కీర్తనల రాష్ట్ర స్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు తొలి వాగ్గేయకారునిగా 32 వేలకు పైగా కీర్తనలను స్వరపరిచి, తెలుగు భాషా వైభవానికి విశేష కృషి చేశారని కొనియాడారు. గొప్ప వైష్ణవ భక్తునిగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సేవించి, స్వామివారి సాక్షాత్కారం పొందిన మహా భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు అని కీర్తించారు. భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు కృషి అమోఘమైనదని తెలిపారు. రామచంద్రరాజు మాట్లాడుతూ తెలుగు వారి లోగిళ్లలో అన్నమయ్య సంకీర్తనలు లేని రోజులు ఉండవని తెలిపారు. గొప్ప వాగ్గేయకారులైన క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారితో పాటు నేటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వారికి మార్గదర్శకులని పేర్కొన్నారు. సంగీత, సాహిత్య అంశాల్లో ప్రతిభ కలిగిన బాలబాలికలతో పాటు యువతీ, యువకులను సమాజానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం – అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు డాక్టర్ రాయదుర్గం శ్యాం కుమార్, తులసీబాయిల అన్నమయ్య సంకీర్తనల కచేరి ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు శేషు రాణి, ఇంటాక్ సభ్యులు సీతా రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ హేమాంబ, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ ఉషశ్రీ పాల్గొన్నారు.