
ప్రజలపై నీటి భారం మోపే కుట్ర !
● మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం ● ప్రతి ఇంటికి నీటి మీటర్ ఏర్పాటు చేయాలి ● కమిషనర్‌ను చూసి ప్రజలు నవ్వుతున్నారు ● గుంటూరు నగర పశ్చిమ ఎమ్మెల్యే మాధవి వ్యాఖ్య ● నీటి మీటర్లను వ్యతిరేకించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోగా ప్రజల నడ్డి విరిచేందుకు అన్ని దారులు వెతుకుతోంది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతి ఇంటికీ నీటి మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతు పలికారు. అయితే, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యతిరేకించారు. తూర్పులో ఎక్కువ శాతం పేదలు నివసిస్తుంటారని, వారిపై భారం వేయవద్దని కోరారు. అవసరమైతే పశ్చిమ నియోజకవర్గంలో నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
జ్యోతిర్మయి అపార్ట్‌మెంట్ అంశాన్ని
సైడ్ చేసేందుకేనా?
నగరంలో జ్యోతిర్మయి అపార్ట్‌మెంట్‌కు అనధికారికంగా నగరపాలక సంస్థ అధికారులు ఎనిమిది అంగుళాల వాటర్ పైపులైన్ కనెక్షన్ ఇచ్చారని, దీని వల్ల ఏడు వార్డులకు తాగునీరు సక్రమంగా అందడం లేదని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సదరు అపార్ట్‌మెంట్‌కు తొలుత అనధికారికంగా కనెక్షన్ ఇచ్చారని, ఆ తరువాత అన్ని ఫీజులు కట్టించుకుని అధికారికం చేశామని తెలిపారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నగరంలో నీటి వృథా ఎక్కువ ఉందని, మీటర్లు పెడితే తగ్గించవచ్చని సూచించారు. దీనికి జ్యోతిర్మయి అపార్ట్‌మెంట్ అంశం నుంచి అందరి దృష్టి మర్చలేందుకు నీటి మీటర్ల ఏర్పాటును లేవనెత్తారని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు.
కమిషనర్‌ను చూసి ప్రజలు నవ్వుతున్నారు
నగర కమిషనర్ రోడ్ల వెంబడి తిరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడంతో ప్రజలు నవ్వుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వీధి కుక్క దాడిలో ఓ చిన్నారి చనిపోయిన కొద్దిరోజుల తరువాత, పిచ్చి కుక్క ఒకేసారి 20 మందిపై దాడి చేసిందని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల ఉపయోగం లేదన్నారు. వీధి కుక్కల నియంత్రణకు గత రెండు సార్లు కౌన్సిల్‌లో మాట్లాడానని, అసెంబ్లీలో కూడా ప్రస్తావించినా అధికారుల నుంచి అశించిన స్థాయిలో సమాధానం రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడం లేదు కాబట్టే, ఒకే ప్రశ్న సభ్యులు రెండు, మూడు సార్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. ఈసారి ఇదే విధంగా జరిగితే సంబంధిత అధికారిపై సస్పెన్షన్ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాధవి కోరారు.

ప్రజలపై నీటి భారం మోపే కుట్ర !