
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కంజుల విఠల్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమ్యునిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు, బ్యాంక్ రుణాలు, అకాల వర్షాలతో నష్టపోయినవారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 13న గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో కౌలురైతులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.