
మోసపోయాం.. ఆదుకోండి !
న్యాయం చేయాలని పోలీసులకు దివ్యాంగుల విన్నపం
నగరంపాలెం: పోగొట్టుకున్న కారుని అప్పగించడం లేదని ఓ అంధుడు, ఉద్యోగం పేరుతో తనను ఇద్దరు వ్యక్తులు మోసగించారని మరో దివ్యాంగురాలు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల గోడు అలకించారు. ప్రజా ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. నిర్ణీతవేళల్లో ఫిర్యాదులు పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన బాధితులకు సిబ్బంది మజ్జిగ పంపిణీ చేశారు.