
ఎల్‌టీపీల పొట్టగొడుతున్న ప్రభుత్వం
లైసెన్స్‌డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలల కిందట నూతనంగా సెల్ఫ్ సర్టిఫికెట్ స్కీం –2025 నిబంధనలు తీసుకువచ్చి ఎల్‌టీపీ(లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్)ల పొట్టగొడుతోందని లైసెన్స్‌డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సతీష్ వాపోయారు. సోమవారం అరండల్‌పేటలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 చదరపు మీటర్లలోపు స్థలాలకు భవన నిర్మాణ అనుమతుల్లో తప్పులు జరిగితే అందుకు బాధ్యులుగా ప్లాన్ ఇచ్చిన ఎల్‌టీపీలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎస్‌సీఎస్ (సెల్ఫ్ సర్టిఫికెట్ స్కీం) ఉందని తెలిపారు. భవన నిర్మాణ సమయంలో డీవీయేషన్ చేసుకుని యజమాని ఇంటి నిర్మాణం చేపడితే దానికి ఎల్‌టీపీలను బాధ్యులుగా చేయడం సబబు కాదని పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ చట్టం కింద చర్యలతో పాటు ఐదేళ్ల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధనలతో ఎల్‌టీపీలు గత కొద్ది నెలలుగా ప్లాన్‌లు దరఖాస్తు చేసే పరిస్థితి లేదని, కొద్ది నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎస్‌సీఎస్ స్కీం కింద తెచ్చిన నిబంధనలను సడలించాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైనేనిలక్ష్మణ్, నగర చైర్మన్ పరమహంస, నగర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, నాగశ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.