సర్దుమణిగిన వర్గపోరు! | - | Sakshi
Sakshi News home page

సర్దుమణిగిన వర్గపోరు!

May 5 2025 8:44 AM | Updated on May 5 2025 10:34 AM

సర్దుమణిగిన వర్గపోరు!

సర్దుమణిగిన వర్గపోరు!

● శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి కమిటీ ఇరు వర్గాలతో సమావేశమైన జిల్లా ఎస్పీ ● స్వయం ప్రకటిత పాలకవర్గం చెల్లదని స్పష్టీకరణ ● హైకోర్టులో వ్యాజ్యం వేసి, సర్వసభ్య సమావేశం ఎలా జరుపుతారని ప్రశ్న ● హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు ఇరువర్గాలు కార్యకలాపాలు నిలిపివేయాలి ● తాత్కాలికంగా తటస్థులకు ఆలయ కార్యక్రమాల నిర్వహణ ● ఎస్పీ సూచనకు ఇరువర్గాల అంగీకారం
శ్యాంప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు

తెనాలి: శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ వివాదం సద్దుమణిగింది. దేవస్థానం కమిటీ, స్వయం ప్రకటిత పాలకవర్గం రెండూ తమ కార్యకలాపాలను నిలుపుదల చేశాయి. వివాదం హైకోర్టులో ఉన్నందున, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా అంగీకారం తెలియజేశారు. అప్పటివరకు అందరికీ సమ్మతమైన డబుల్‌హార్స్‌ మిపనగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాం ప్రసాద్‌ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. గుంటూరు జిల్లా ఎస్పీ సమక్షంలో ఆయన ఆదేశాలపై కుదిరిన ఒప్పందమిది. ఎస్పీ సూచనలకు ఇరువర్గాలు సమ్మతిని తెలియజేశాయి.

జిల్లా ఎస్పీ నుంచి పిలుపు..

శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ వివాదం, వరుస పరిణామాల నేపథ్యంలో ఆలయ కమిటీ ఆదివారం సర్వసభ్య సమావేశానికి సభ్యులకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం కమిటీ నేతలు మీడియాకు వెల్లడించారు. స్వయం ప్రకటిత పాలకవర్గం నేతలు సర్వసభ్య సమావేశం చెల్లదని, సభ్యులు ఎవరూ హాజరుకావొద్దని మీడియాకు చెప్పారు. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ నుంచి ఇరువర్గాలకు పిలుపువచ్చింది. శనివారం రాత్రి ఏడున్నర గంటల తర్వాత అక్కడకు చేరుకున్నారు. ఎస్పీ సూచనపై ఆలయ కమిటీ నుంచి అయిదుగురు, స్వయం ప్రకటిత పాలకవర్గం నుంచి అయిదుగురు చొప్పున హాజరయ్యారు. అధికారులు మరో ఆరుగురు, న్యాయసలహాదారు సమావేశంలో పాల్గొన్నారు.

ఇరువర్గాలను ప్రశ్నించిన ఎస్పీ

ఆలయానికి చెందిన ఇరు వర్గాలకు జిల్లా ఎస్పీ క్లాస్‌ పీకారు. ముందుగా స్వయంప్రకటిత పాలకవర్గాన్ని ప్రశ్నించారు. గత నెల 13న జరగాల్సిన సర్వసభ్య సమావేశం రసాభాస కావటంతో పోలీసుల అనుమతితోనే వాయిదా వేసినట్టు గుర్తుచేశారు. ఆ ప్రకారం మరోసారి తేదీని నిర్ణయించి సభ్యులకు నోటీసులు జారీచేసి సమావేశం నిర్వహించాల్సి ఉందని గుర్తుచేశారు. అందుకు భిన్నంగా రెండురోజుల్లోనే 300 మందికి పైగా సంతకాలు తీసేసుకుని పాలకవర్గంగా ఎన్నికయ్యామంటే ఎలా చెల్లుతుందని ఎస్పీ ప్రశ్నించారు. మొత్తం 1100 వరకు గల సభ్యుల్లో 200 మంది వరకు మరణించి ఉంటారనుకుంటే మిగిలినవారిలో 600 మంది ఆలయ కమిటీ పక్షాన ఉన్నట్టా? అని కూడా ఎస్పీ ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. బైలా ప్రకారం జరగని ఎన్నిక ఎలా చెల్లుబాటవుతుందని ప్రశ్నిస్తూ, మళ్లీ ఆ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి చట్టబద్ధత ఏముంటుందని కూడా అడిగారు.

● అదేవిధంగా స్వయంప్రకటిత పాలకవర్గం ఎన్నిక, ఇతర అంశాలపై హైకోర్టును ఆశ్రయించిన ఆలయ కమిటీ ఇప్పుడు సర్వసభ్య సమావేశం ఎలా జరుపుతుందని కూడా ఎస్పీ ప్రశ్నించారు. ఇదికూడా మరొక వివాదం అవుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు రెండు వర్గాలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్పీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఈలోగా జరగాల్సిన శ్రీవాసవీ అమ్మవారి జన్మదిన వేడుకల నిర్వహణకు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన తటస్టుల పేర్లను చెప్పమని ఎస్పీ చేసిన సూచనపై ఆలయ కమిటీ వర్గం ఆర్యవైశ్య ప్రముఖుడు నంబూరు వెంకట కృష్ణమూర్తి పేరును సూచింది. స్వయం ప్రకటిత పాలకవర్గం నేతలు పెండేల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావులు కృష్ణమూర్తి పేరుకు అభ్యంతరం తెలియజేశారు. దీంతో డబుల్‌హార్స్‌ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌ శ్యాంప్రసాద్‌ పేరును చెప్పారు. ఇందుకు పెండేల వెంకట్రావు వర్గం అంగీకారం తెలియజేసింది. హైకోర్టు ఆదేశాలు వచ్చేవరకు మోహన్‌ శ్యాంప్రసాద్‌ ఆలయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని ఎస్పీ వెల్లడించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశం కొనసాగింది. ఇదిలావుంటే, ఆదివారం ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశానికి నోటీసులు అందుకున్న దేవస్థానం కమిటీ సభ్యులు వందలాదిమంది ఆలయ ప్రాంగణానికి వచ్చారు. అక్కడకు వచ్చాక సమావేశం లేదని తెలుసుకుని తిరుగుముఖం పట్టారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావు, కొణిజేటి గోపీకృష్ణ, మద్దాళి శేషాచలం తదితరులు జిల్లా ఎస్పీ సూచనలపై సర్వసభ్య సమావేశం నిర్వహించటం లేదని మీడియాకు వెల్లడించారు. అలాగే మునగాల మోహన్‌శ్యాంప్రసాద్‌ పర్యవేక్షణలో అమ్మవారి జన్మదిన ఉత్సవాలు జరుగుతాయని చెబుతూ ఆర్యవైశ్యులు వర్గాలకతీతంగా సమష్టిగా పాల్గొని వేడుకలను జయప్రదం చేసి, అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement