
ముస్తాబైన వేదికలు
పెదకాకాని: ప్రపంచ తెలుగు బాలల పండుగ బాలోత్సవ్– 2023 ఉత్సవాలకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ) కళాశాల ప్రాంగణం సిద్ధమైంది. ప్రఖ్యాతి గాంచిన బాలోత్సవ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 600 పాఠశాలల నుంచి 14,000 మంది విద్యార్థులు ఇప్పటికే పేర్లను నమోదు చేసుకున్నారు. 20 అంశాలు, 61 విభాగాల్లో పోటీలు నిర్వహించడానికి కళాశాల ప్రాంగణంలో 30 వేదికల్ని ఏర్పాటు చేశారు. బాలోత్సవ్ అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ వేడుకల్ని సోమవారం ఉదయం 10.00 గంటలకు అంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్. సురేష్ కుమార్, ఏపీహెచ్‌ఆర్‌సీ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మార్గనిర్దేశం కోసం గుంటూరు, విజయవాడ నగరాలలోని బస్టాండు, రైల్వేస్టేషన్‌లో సేవా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కళాశాలకు చెందిన బస్సుల ద్వారా బాలోత్సవ్ ప్రాంగణానికి తరలిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు బాలోత్సవ్ ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనం సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల్ని న్యాయ నిర్ణేతలుగా నియమించినట్లు చెప్పారు. బాలోత్సవ్ ప్రాంగణంలో వీవీఐటీ కళాశాలకు చెందిన స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్, 600 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. పెదకాకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం, అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. పోటీ వేదికల వద్ద వీవీఐటీ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులకు సహాయ, సహకారాలు అందిస్తారని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ వివరించారు.

పేర్లు నమోదు చేయిస్తున్న ఉపాధ్యాయులు