
స్వర్ణలతను సత్కరిస్తున్న మాణిక్యవరప్రసాద్ తదితరులు
పాత గుంటూరు: మహాకవి జాషువా కళాపీఠం వ్యవస్థాపకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో జాషువా జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం కన్నవారి తోటలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జాషువా రచించిన ఖండ కావ్యం ‘క్రీస్తు చరిత్ర’ పై వ్యాఖ్యానం, విశ్లేషణ నిర్వహించారు. సభకు విశ్రాంత డీఐజీ శావల బాలస్వామి అధ్యక్షత వహించారు. కార్డ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ యం. స్వర్ణలత ముఖ్య వక్తగా పాల్గొని క్రీస్తు చరిత్ర కావ్యంపై వ్యాఖ్యనం, విశ్లేషణ చేశారు. జాషువా క్రీస్తు చరిత్ర కావ్యం అపురూపమని తెలిపారు. అనంతరం స్వర్ణలతను సత్కరించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చి కమిటీ చైర్మన్ పినపాటి నానారావు, ఫాదర్ గాబ్రియేల్, హైకోర్టు న్యాయవాది గడ్డం ఎలీషా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోసెఫ్ కుమార్, జాషువా కళాపీఠం కార్యదర్శి నూతక్కి సతీష్ పాల్గొన్నారు. క్రీస్తు చరిత్ర కావ్యంలోని పద్యాలను చంద్రపాల్, బాబూరావు ఆలపించారు. జాషువా అభిమానులు, మాదిగ జనసేవా సమితి సభ్యులు, తెలుగు బాప్టిస్ట్ చర్చి సభ్యులు పాల్గొన్నారు.