మనోడికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

హర్ష ప్రతాపనేని - Sakshi

తెనాలి: తెలుగు సినిమా రేంజ్‌ పెరిగింది.. పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగింది. అందివచ్చిన టెక్నాలజీతో దర్శక నిర్మాతలు వెండితెరపై అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారు. అదే బాటలో నవతరం సత్తాను చాటుతోంది. వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలతో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. అవార్డుల పోటీలోనూ ముందంజలో ఉంటున్నారు. ‘గతం’ సినిమా మేకర్స్‌ దీనికి నిదర్శనం. డార్క్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తీసిన ‘ఐడీ’తో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకున్నారు. సినిమా నిర్మాతల్లో ఒకరైన హర్ష ప్రతాపనేని తెలుగు వాడు...తెనాలి వాడు కావడం విశేషం!

విడుదల కాకముందే అవార్డు

ఓటీటీ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘గతం’ మేకర్స్‌ రూపొందించిన రెండో తెలుగు సినిమా ‘ఐడీ’. టాలీవుడ్‌, హాలీవుడ్‌ టెక్నీషియన్లు పనిచేశారు. చిత్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తీసిన సినిమాకు కిరణ్‌రెడ్డి కొండమడుగుల దర్శకత్వం వహించారు. హర్ష ప్రతాపనేని, సృజన్‌ యరబోలుతో కలసి సుభాష్‌ రావాడ, భార్గవ పోలుదాసు నిర్మాతలుగా వ్యవహరించారు. భార్గవ పోలుదాసు, రాకేట్‌ గలేటే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల ఫేం శ్రీచరణ్‌ పాకాల సంగీతం సమకూర్చారు. హాలీవుడ్‌ డీపీ హోరాసియో మార్టినెజ్‌ సినిమాటోగ్రఫీ అందించగా, కాటెరినా ఫిక్కార్డో ప్రొడక్షన్‌ డిజైన్‌ పనులను పర్యవేక్షించగా, ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేశారు. విడుదల కాకముందే ఈ సినిమా దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కన్నడ చిత్రం ‘చార్లీ 777’ను వెనక్కునెట్టి, ‘బలగం’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలకు దీటుగా ‘ఐడీ’ సినిమా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. మరోవైపు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సర్క్యూట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 37 అవార్డుల్ని అందుకుంది. 31 అఫీషియల్‌ సెలక్షన్స్‌ను సాధించి, 5 ఆనరబుల్‌ మెన్షన్స్‌ను అందుకుంది. నాలుగు నామినేషన్లను పొందింది. త్వరలో కెనడీయన్‌ స్క్రీన్‌ అవార్డు (ఆస్కార్‌ తరహాలో)లకు క్వాలిఫైయింగ్‌ ఫెస్టివల్‌ అయిన ప్రముఖ ఓక్‌విల్లే ఫెస్టివల్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ ఆర్ట్‌లో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ‘బలగం’ సినిమా దాదాసాహెబ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ సంగీతం’ అవార్డును అందుకోగా, ‘సీతారామం’ సినిమా ‘ఉత్తమ చిత్రం’గా అవార్డును అందుకుంది. ఐడీ చిత్రం ‘ఉత్తమ ఎడిటింగ్‌’అవార్డును గెలుచుకుంది.

వినూత్న కథాంశం

‘మీరు ఒక రోజు నిద్రలేచాక, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోతే...’అనే విచిత్రమైన ఆలోచన ఐడీ సినిమా కథాంశం. సహ నిర్మాతగా వ్యవహరించిన హర్ష ప్రతాపనేని తండ్రి పి.వి. గణేష్‌ స్వస్థలం తెనాలి సమీపంలోని జంపని. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)గా ఖమ్మంలో చేస్తున్నారు. తల్లి మంజులాదేవి గృహిణి. తండ్రి ఉద్యోగం కారణంగా వివిధ ప్రదేశాల్లో చదివిన హర్ష, హైదరాబాద్‌లో బీటెక్‌ చేశాడు. ఒక్లహామా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేసి, అమెరికాలోని ప్రతిష్టాత్మక జేపీ మోర్గాన్స్‌ ఛేజ్‌ బ్యాంక్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేస్తున్నారు. చదివే రోజుల్లో క్లాస్‌మేట్‌ కిరణ్‌తో కలసి లఘుచిత్రాలు తీసిన హర్ష, ఉద్యోగంలో కొనసాగుతూనే కిరణ్‌తో కలిసి ‘గతం’ సినిమా తీశారు. సహ నిర్మాత, సహ దర్శకుడు, సహ రచయితగా వ్యవహరించాడు. గతం విజయంతో ఇప్పుడు ‘ఐడీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఓక్‌విల్లే ఫెస్టివల్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ ఆర్ట్‌లో ప్రదర్శనకు ఎంపిక ఇప్పటికే 37 అవార్డులు గెలిచిన సినిమా రెండో సినిమా ‘ఐడీ’తో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సర్క్యూట్‌లో సంచలనం నిర్మాతల్లో ఒకరు హర్ష ప్రతాపనేని వృత్తి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, ప్రవృత్తి సినిమా

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top